మూలం : ఆంద్రభూమి
మనం స్వయం సమృ ద్ధి సాధించాలన్నా, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా అధిగమించాలన్నా ‘చరఖా’ మాదిరి అనునిత్యం పని చేస్తూనే ఉండాలని జాతిపిత మ హాత్మా గాంధీ అలనాడు స్వాతంత్య్రోద్యమ కాలం లో దేశ ప్రజలను చైతన్యవంతం చేసేవారు. భారతీయ సంస్కృతికి చరఖాతో అనుబంధం ఈనాటిది కాదు. అయితే, కాలగమనంలో గాంధీ ఆశలు, ఆకాంక్షలన్నీ తలకిందులై, నేటి తరం పిల్లలకు ‘చరఖా’ అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో జాతి జనులకు స్ఫూర్తినిచ్చిన ‘చరఖా’ జన జీవనం నుంచి దాదాపు అదృశ్యమైంది. ఇందుకు భిన్నంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి చదువులో ఉత్తమ ప్రతిభ కనపరచినప్పటికీ ‘చరఖా’ను మాత్రం వదిలేది లేదంటూ స్పష్టం చేస్తోంది. తమిళనాడులోని దిండిగుల్ జిల్లా చిన్నల్‌పట్టికి చెందిన నిత్య (16) ఇటీవల ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో 491 మార్కులు ( 500 మార్కులకు) సాధించి అందరినీ అబ్బురపరిచింది. సాంఘిక శాస్త్రంలో నూరు శాతం మార్కులను, గణితం, సైన్స్‌ల్లో 97 మార్కులు సాధించింది. తన తండ్రి నేత కార్మికుడిగా పనిచేస్తుండగా, ఇంట్లో చరఖా ఒడుకుతూ నిత్య ఎంతో కొంత సంపాదిస్తోంది. విద్యుత్ కోత, నీటి కొరత కారణంగా చేనేత పరిశ్రమ ఇక్కట్ల పాలవగా, నిత్య తండ్రి ముత్తుసామి రోజుకూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. నిత్య అక్కచెల్లెళ్లలో ఒకరు చాక్లెట్ల కంపెనీలో పని చేస్తుండగా, ఇంకో సోదరి బిఎస్సీ చదివింది. కుటుంబ సభ్యులు, టీచర్ల ప్రోత్సాహం కారణంగా తాను చదువుపై దృష్టి పెట్టినా, కుటుంబ పోషణ కోసం రోజూ కనీసం నాలుగు గంటల సేపు చరఖాపై పనిచేసి చీరలు నేస్తుంటానని నిత్య చెబుతోంది. చదువుకు కేవలం నాలుగు గంటలు కేటాయిస్తానని చెబుతున్న ఈమె తాను ఇప్పటి వరకూ సుమారు 300 చీరలను నేసినట్లు తెలిపింది. ఖర్చులన్నీ పోను వారానికి కనీసం 700 రూపాయల ఆదాయం వస్తోందని ఆమె సంబర పడుతోంది. చదువులో మరింతగా రాణించి, ఐఎఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన జీవితాశయం అని ఆమె తన మనసులోని మాట చెప్పింది. అన్ని విధాలా నిరాదరణకు గురవుతున్న పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసేందుకు తాను ఐఎఎస్‌లో ఉత్తీర్ణత సాధించి తీరతానని ఆమె ధీమాగా చెబుతోంది. చేతివృత్తులను ఆదరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది.
మూలం : ఆంద్రభూమి
0 Comments
|