మల్లీశ్వరిది మెదక్ జిల్లాలోని చిన్న చెలిమెడ అనే కుగ్రామం. తండ్రి గరణయ్య రెండెకరాల పేద రైతు. తల్లి మొగులమ్మ వ్యవసాయ కూలీ. భార్యభర్తలు పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి.
బతకడానికి ఆసరా లేకపోయినా తమ వంశానికొక మగాడు కావాలన్నది మొగులమ్మ అత్తగారి ఆశ. ఆ ఆశ కడుపునింపదనే ధ్యాసను మరిచేలా చేసింది. ‘ఒక్క వారసుడి’ కోసం కన్న కలలు మొగులమ్మను ఐదుగురు ఆడపిల్లల తల్లిని చేశాయి. ఉన్న భూమిలో పంట పండినా పండక పోయిన మొగులమ్మనే కూలీనాలీ చేసి భర్తను, పిల్లలను పోషించాల్సిన పరిస్థితి ఒకవైపైతే, మరోవైపు వారసుడి కోసం ఆరాటం. మొత్తం మీద ఆరవ సంతానం రూపంలో వారి ఆశ తీరింది. ఆరవ సంతానంగా మగపిల్లాడు పుట్టాడు. కానీ మొగులమ్మ మాత్రం శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. అది 1999వ సంవత్సరం అప్పుడు మల్లీశ్వరి వయస్సు కేవలం 11 సంవత్సరాలు. మొగులమ్మ మరణించడంతో పిల్లల బాధ్యత గరణయ్యపై పడింది. ఒకవైపు పంటలు పండని భూమి… మరోవైపు ఆరుగురు పిల్లలు… వారి పోషణ తన వల్ల కాదనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు.
ఆరుగురిలో పెద్దమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటికి వారం రోజుల వయసున్న ఆ ఇంటి మగపిల్లాడితో సహా అయిదుగురు పసివాళ్ళు అనాథలయ్యారు. ఆ సమయంలోనే మొగులమ్మ తమ్ముడు వారిని చేరదీశాడు. రంగాడ్డి జిల్లా మర్పల్లి మండలంలోని మల్లిఖార్జున గిరి ఆయన సొంతూరు. ఆ పిల్లలందరినీ తనింటికి తీసుకెళ్లాడు. ఆయనేమీ భూస్వామి కాదు. ఆయనకూ ముగ్గురు పిల్లలు. తనకున్నదాంట్లోంచే తలాకొంచెం పెట్టి తన పిల్లలతో పాటే తన సోదరి పిల్లలనూ పోషించాడు. పిల్లల అయిదువేళ్లూ నోట్లోకి వెళ్లే దారి చూడ్డానికే సరిపోయింది కానీ ఆ పిల్లల చేతికి పలకా, బలపం ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అయిదుగురిలో రెండవ అక్క నాగమణి మాత్రమే ఏదైనా పని చేయగలిగే వయస్సులో ఉంది. పిల్లలు పెద్దవాళ్లు అవుతూనే కుటుంబ భారాన్ని పంచుకున్నారు. చిన్నచిన్న పనులు చేస్తూ మేనమామకు ఆసరాగా నిలిచారు. మూడవదైన మల్లీశ్వరి కూడా తనవంతుగా గ్రామంలో పశువుల కాపరిగా మారింది.
అనుకోని అవకాశం…
‘చిన్నతనంలో పశువులను కాస్తున్నానన్నట్లే కానీ, తోటిపిల్లలు స్కూలుకు వెళ్తుంటే మనసు కొట్టుకునేది. నేను కూడా రంగురంగుల యూనిఫాం వేసుకుని, పుస్తకాల బ్యాగు పట్టుకుని స్కూలుకు వెళ్తున్నట్లు కలలు కనేదాన్ని. కనిపించిన వారందరినీ పుస్తకాలకు ఎంతవుతుంది, చదువుకునేందుకు ఎంత ఖర్చవుతుందని అడిగేదాన్ని. నన్ను చదివించే వారికోసం కళ్లల్లో వత్తులు వేసుకుని చూసేదాన్ని. ఆ అవకాశం ఎం.వి.ఫౌండేషన్ రూపంలో వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. హైదరాబాద్‌కు చెందిన ఎం.వి.ఫౌండేషన్ (మామిడిపుడి వెంకట రంగయ్య ఫౌండేషన్) ఒకసారి మా ఊరిలో శిబిరం ఏర్పాటు చేసింది. దాని ముఖ్యోద్దేశం బాలకార్మికులను గుర్తించడం, వారికి విద్యావకాశాలు కల్పించడం. అది నా కోసమే పెట్టారన్నంతగా సంబురమనిపించింది. నేనూ ఆ శిబిరంలో చేరిన’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది మల్లీశ్వరి.
ఫస్ట్‌క్లాస్…
తన అక్కాచెల్లెల్లను కూడా ఆ శిబిరంలో చేర్చితే వారు కూడా చదువుకునే అవకాశం కలుగుతుందన్న ఆశ కలిగింది ఆమెకు. కానీ వారు అంతగా ఆసక్తి చూపించలేదు. చివరికి ఒక అక్క నాగమణిని మాత్రం చదువుకోవడానికి ఒప్పించ గలిగింది. తొలుత రంగాడ్డి జిల్లా ఆలూరు గ్రామంలో ఉన్న ప్రాంతీయ కేంద్రంలో ఇద్దరూ చేరారు. అక్కడ బ్రిడ్జి కోర్సులో చేరి ఏడవతరగతి వరకు చదువుకున్నారు. ఆ సంవత్సరం ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇద్దరూ పాసయ్యారు. ఆ తరువాత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందే. ఎం.వి.ఫౌండేషన్ వాలంటీర్లు ముందుగా మల్లీశ్వరి మేనమామను ఒప్పించి ఆమెను, ఆమె అక్క నాగమణిని హైస్కూల్‌లో చేర్పించారు. అలా అక్కచెప్లూల్లిద్దరూ హైదరాబాద్ చేరారు. అక్కడ 8,9,10 తరగతులు చదివే అవకాశం కల్గింది వాళ్లకు. పదవతరగతిలో 72 శాతం మార్కులతో మల్లీశ్వరి పాసైతే, నాగమణి 70శాతం మార్కులు సాధించింది.
ఆదుకున్న ఎం.వి.ఫౌండేషన్, దాతలు
ఎం.వి.ఫౌండేషన్, దాతల సహకారంతో వికారాబాద్‌లో ఇంటర్ మీడియట్ పూర్తి చేసింది మల్లీశ్వరి. ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీలో చేరాలంటే మాత్రం డబ్బులు అవసరం. ఇంటర్‌తోనే చదువు ఆపేస్తే ఇన్నాళ్లు తను పడిన కష్టానికి ఫలితం ఉండదని ఆమె ఆలోచన. ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలన్నదే ఆమె ఆశయం. దీనికోసం మల్లీశ్వరి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. తన చదువు కోసం ఎంతోమంది దాతలను సంప్రదించింది. అలా అప్పటి కూకట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ అయిన శ్రీనివాస్ మల్లీశ్వరి డిగ్రీ మొదటి సంవత్సరానికి అయ్యే ఖర్చు భరించడానికి ముందుకు వచ్చాడు. కానీ ఆ తరువాత…? ఎన్నాళ్లు తను ఇలా దాతల మీద ఆధారపడాలి అనే ఆలోచన వచ్చింది మళ్లీశ్వరికి.
దారి చూపిన అభిరుచి
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మల్లీశ్వరి ఎం.వి.ఫౌండేషన్‌లో ఉన్నప్పుడే చదువుతో పాటు తన అభిరుచి మేరకు పాటలు పాడడం, వీడియో తీయడం నేర్చుకుంది. ఎం.వి.ఫౌండేషన్ నిర్వహించే పలు కార్యక్షికమాల్లో పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేది. తమ కార్యక్షికమాలను సరదాగా వీడియోలో బంధించేది. సరదాగా నేర్చుకున్న వీడియోక్షిగఫి తనకు ఉపాధి చూపిస్తుందని మల్లీశ్వరి ఏనాడు ఊహించి ఉండదు. కానీ అదే జరిగింది.
వీడియోక్షిగఫి అంత సులువైన పనేమీ కాదు. అంతేకాదు అప్పుడు ఇప్పుడున్నంత చిన్న కెమెరాలు అందుబాటులో లేవు. బరువుగా ఉన్న కెమెరాను గంటల తరబడి భుజాల మీద మోస్తూ వీడియో తీయాల్సి వచ్చేది. అయినా మల్లీశ్వరి వెనుకడుగు వేయలేదు. తన భవిష్యత్తును తాను తీర్చిదిద్దుకోవాలంటే ఎంత కఠినమైన పనైనా చేయాల్సిందే అనుకుంది. అలా వీడియోక్షిగఫీనే ఉపాధి మార్గంగా ఎంచుకుంది. చిన్న చిన్న అవకాశాలతో చిన్న మొత్తం సంపాదిస్తూనే తన చదువును పూర్తి చేసింది. మొత్తం మీద 2010లో బీఎస్సీ(మ్యాథ్స్) పూర్తిచేసిన మల్లీశ్వరి ఆ తరువాత కూడా వెనుతిరిగి చూడలేదు.
వీడియోజర్నలిస్టుగా….
వీడియో తీస్తూ ఉపాధి పొందుతున్న మల్లీశ్వరిని న్యూస్ ఛానళ్లు ఆకర్షించాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగిన వాలిపోయే టీవీ జర్నలిస్టులకు ప్రధాన ఆధారం కెమెరామన్. అంటే వీడియోక్షిగాఫర్. తనకు కూడా వీడియో తీయడంలో అనుభవం ఉంది కనుక తానేందుకు ‘కెమెరాఉమన్’ కాకుడదు అన్న ఆలోచన వచ్చింది ఆమెకు. అనుకున్నదే తడవుగా ‘హెచ్‌ఎం టీవీ’ ఛానల్‌లో ఇంటర్వ్యూకు వెళ్లింది. మొదట ఆడపిల్ల ఈ వృత్తిని సమర్థవంతంగా చేయగలుగుతుందా? అనే అనుమానం అందరిలోనూ వ్యక్తమైంది. ఆ అనుమానానికి కారణం… అప్పటి వరకు వీడియో జర్నలిస్టుగా మహిళలు ఎవరూ లేకపోవడమే! మొదటినుంచీ కష్టాలను ఈదడం అలవాటైన మల్లీశ్వరికి వీడియో జర్నలిస్ట్ అనే హార్డిల్ దాటలేనంత క్లిష్టమైందిగా అనిపించలేదు ఆమెకు. అందుకే తన ప్రతిభాసాహసాలతో సిబ్బంది అనుమానాన్ని పటాపంచలు చేసింది. ఆమె ఆసక్తి గమనించిన హెచ్‌ఎం టీవీ యాజమాన్యం కూడా వీడియో జర్నలిజంలో మల్లీశ్వరీకి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రోత్సహించింది. అలా ఆ రంగంలో చాలా సులువుగా నిలదొక్కుకోగలిగింది. రాష్ట్రంలోనే ‘మొట్టమొదటి కెమెరా ఉమన్’గా తన కెరీర్‌ను ప్రారంభించింది. పూర్తిగా మగవాళ్లకే పరిమితమైన వీడియోజర్నలిజంలో మీరేలా రాణించగలిగారిని మల్లీశ్వరిని అడిగితే…‘హెచ్‌ఎమ్ టీవీ యాజమాన్యం తనను ఎంతగానో ప్రోత్సహించింది, తోటి వీడియోజర్నలిస్టులు కూడా నన్ను ఒక కొలీగ్‌గానే చూశారు’అని తన తొలి అడుగులోని ఆనందాన్ని తెలిపింది. ప్రస్తుతం మల్లీశ్వరి సీవీఆర్ న్యూస్ ఛానల్‌లో వీడియోజర్నలిస్టుగా పనిచేస్తోంది.
పనీ.. పాట..
మల్లీశ్వరి ప్రస్తుతం వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పటికీ తన మూలాలను మాత్రం మరవలేదు. అందుకే టీవీ జర్నలిస్టుగా బాలకార్మికులు, 108 సేవలపై ప్రత్యేక కార్యక్షికమాల రూపకల్పనకు కృషిచేస్తోంది. అంతేకాదు గాయనీగా తెలంగాణ ఉద్యమ గీతాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, భక్తిగీతాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన 11 ఆల్బమ్స్‌లో తన గళాన్ని వినిపించింది మల్లీశ్వరి. వెండితర నేపథ్యగాయనీగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. అందుకే ఇటీవల ఓ సినిమాలో ఒక డ్యూయెట్ కూడా పాడింది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
తనలా మరెవరు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఎం.వి.ఫౌండేషన్‌లాంటి సంస్థల సహకారంతో ఉన్నత చదువులు చదివి, వివిధ రంగాల్లో స్థిరపడిన వారితో కలసి ‘విముక్తి’ అనే ఒక సామాజిక సంస్థను కూడా ప్రారంభించింది. బాలకార్మికులను గుర్తించడం, నగరంలో ఉన్నత వర్గాల ఇళ్లల్లో మగ్గిపోతున్న బాలలను గుర్తించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వారికి విముక్తి కలిపించి విద్యనందించడం, బాల్య వివాహాలను అడ్డుకోవడం వంటి కార్యక్షికమాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థకు మల్లీశ్వరి ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తోంది. తన చదువును డిగ్రీతో ఆపిన మల్లీశ్వరి తనకు వచ్చే జీతంతో ఇద్దరు చెల్లెళ్లను, తమ్ముడినీ చదివిస్తోంది. తనకు ఇతర ఉద్యోగాల మీదా అంతగా ఆసక్తి లేదని, మీడియా రంగంలోనే ‘ది బెస్ట్ కెమెరాఉమన్’ గా ఎదగాలన్నదే తన లక్ష్యం అంటోంది మల్లీశ్వరి. వందల మంది వీడియో జర్నలిస్ట్‌లుండొచ్చు కానీ పశువుల కాపరి నుంచి కెమెరాను డీల్ చేసే స్థాయికి ఎదిగినవాళ్లు కొద్దిమందే ఉంటారు. వాళ్లలో మల్లీశ్వరి ఒకరు. అందుకే ఆమె కెమెరా ఉమనే కాదు ఇన్సిపిరేషనల్ ఉమన్ కూడా!
75మందిలో ఒక్కదాన్నే
ఎంతమగవారితో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కెమెరాఉమన్ అంటే చిన్నచూపు ఉన్న మాట వాస్తవమే. కానీ నా విషయంలో మాత్రం ఏనాడు ఈ వివక్ష కనిపించలేదు. ఒకప్పుడు నేనొక్కదాన్నే కెమెరాఉమన్‌ని. కానీ ఇప్పుడు వివిధ ఛానెల్స్‌లో మహిళలు వీడియో జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు. అయితే వీరి సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సీవీఆర్ న్యూస్‌లో ఉన్న 75 మంది కెమెరాపర్సన్స్‌లో నేనొక్కదాన్నే ఉమన్‌ని.