
అంచెలంచెలుగా ఎదిగి, నేడు ప్రైవేట్ బ్యాంకుల్లో అతిపెద్ద మూడవస్థానాన్ని ఆక్రమించిన యాక్సిస్ బ్యాంక్ ఎండి, సిఇవోగా షిఖాశర్మ ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఉన్నపళంగా ఆమె ఆకాశానికి ఎదగలేదు. ఆ స్థానానికి చేరుకునేందుకు ఆమెకు దాదాపు 30సంవత్సరాల కాలం పట్టింది. తను పనిచేస్తున్న సంస్థలో నమ్మకంగా చేయడమే కాదు, బ్యాంకును లాభాల బాటలో నడపడంలో ఆమె చేసిన ప్రయత్నాలే నేడు అత్యున్నతస్థాయికి చేర్చింది.
సాధారణంగా ఎక్కువశాతం మహిళలు సాదాసీదా రంగాల్లో పనిచేసేందుకు ఇష్టపడతారు. వృత్తిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, అందులో ఉన్నతస్థానాన్ని చేరుకోవాలనే ఆకాంక్ష ఉన్న స్త్రీల శాతం చాలా తక్కువ. అందునా బ్యాంకింగ్ వంటి ఆర్థికసంస్థల్లో రాణించాలంటే 'వామ్మో! అది మనకు చేతకాదులే' అని తేలిగ్గా కొట్టిపారేస్తారు. కానీ షిఖాశర్మ కూడా అలాగ భావించి ఉంటే ఈనాడు యాక్సిస్‌బ్యాంక్‌కు ఎండి, సిఇవో స్థాయికి ఎదిగి ఉండేవారు కారు. ఆశయం, పట్టుదల ఉండాలే కానీ మహిళలకు అసాధ్యమైన రంగం అంటూ ఏదీ లేదు. నేటి మహిళలకు అన్ని అవకాశాలు, సదుపాయాలు, వసతులతోపాటు విపరీతమైన పోటీ కూడా విపరీతంగా ఉంది. ఇవేవీ మనలో ఉన్న ఆశయాలను దెబ్బతీయలేవు. ఎదిగేందుకు ఇవి ఆటంకాలు కూడా కావు. కష్టపడేతత్వం, ఒక ప్రణాళిక, ఆత్మవిశ్వాసం చాలు మీరనుకున్న స్థాయికి చేరుకునేందుకు అంటారామె.
అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో ఎంబిఎ చదివిన ఆమె 1980లో ఒక ఫైనాన్స్ కంపెనీలో తన కెరీర్‌ను ఆరంభించారు. అకడమిక్‌గా మంచి ర్యాంకు షిఖాకు ఉన్నా, కెరీర్‌లో చొరవగా దూకే తత్వం లేనికారణంగా విదేశీసంస్థలో పనిచేయాలనే ఆశయం ఉన్నా, అందుకు ఆ కంపెనీలు అవకాశాన్ని ఇవ్వకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఆమె ఐసిఐసిఐలో పనిచేసే అవకాశం లభించింది. తనలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిచేసుకుని, వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనే సంకల్పం ఆమెలో మొదలైంది. ఐసిఐసిఐ ఫ్రూడన్షియల్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ దాదాపు 29 సంవత్సరాలు ఆ బ్యాంకులోనే పనిచేశారు. షిఖా తన నైపుణ్యం ద్వారా కేవలం రెండు సంవత్సరాల్లోనే 280 కోట్ల ఆదాయాన్ని ఆ బ్యాంకుకు సమకూర్చి, ఔరా! అనిపించుకున్నారు. అక్కడితో మొదలైన ఆమె కెరీర్ వృద్ధి మళ్లీ వెనుతిరిగి చూసుకోలేనంత ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 2009లో ఐసిఐసిఐ నుంచి యాక్సెస్ బ్యాంకుకు మారారు.
లోపమే కలిసి వచ్చింది
షిఖాశర్మ ఎక్కువగా ఇంటరావర్ట్ (తనలోతాను)గా ఉండడం తన కెరీర్‌కు ఒక మైనస్‌పాయింట్ ఉండేది. కానీ అదే యాక్సిస్‌బ్యాంకుకు వరంగా మారింది. షిఖాశర్మ అలా ఇంటరావర్ట్‌గా ఉంటూ, బ్యాంకు లాభాల్లో నడవాలంటే అందుకు ఏమేం చేయాలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు.
ఆమె సలహాల్లో ఉన్న నైపుణ్యత, అవి ఆచరణయోగ్యంగా ఉండటమేకాక అవి బ్యాంకు లాభాలకు దోహదపడ్డాయి. అంతేకాక బోర్డు మీటింగ్ సందర్భాల్లో ఆమెచ్చిన సలహాలే కంపెనీ అభివృద్ధికి బాటలు వేశాయి.
కుటుంబనేపథ్యం
షిఖాశర్మ భర్త సంజయశర్మ. ఎంబిఎ చదువుతున్నప్పుడే తన బ్యాచ్‌కు చెందిన సంజయశర్మను వివాహమాడారు. ప్రస్తుతం ఈయన టాటా ఇంటర్యాక్టివ్ సిస్టమ్‌లో ఎండిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరికి ఒక బాబు, ఒకమ్మాయి ఉన్నారు. ముంబయిలోని వర్లీలో ఒక ఉన్నతమైన భవనంలో ఈ బ్యాంక్ ఉంది. ఎనిమిదవ అంతస్తులో ఎకనామిక్స్‌కు సంబంధించిన కొన్ని పుస్తకాలు, ఆమె కుటుంబ ఫొటోతో ఎంతో సింపుల్‌గా షికా ఛాంబర్ ఉంటుంది. యాక్సిస్‌బ్యాంక్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ మాత్రం కార్పొరేట్ ఆఫీసులను తలపించేలా వారి ఛాంబర్లు ఉంటాయి. బ్యాంకుకు ఉన్నతమైన హోదాలో ఉన్నా షిఖా మాత్రం ఆమె ఎంత సింపుల్‌గా ఉంటారో, ఆమె ఛాంబర్ కూడా ఎలాంటి ఆడంబరాలు, విలువైన ఫర్నిచర్లు కాక, సాదాసీదాగా ఉంటుంది.
కుటుంబం, వృత్తి ఒక సవాలే...
'నా కుమారుడికి ఉద్యోగం వచ్చిన కొత్తలో నా డ్యూటీకి సెలవు పెట్టాను. అంతే ఆ కొద్ది సమయంలోనే బ్యాంకులో పలు ఉపద్రవ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో వెంటనే నేను డ్యూటీలో చేరాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఉద్యోగం, కుటుంబం ఈ రెండూ మహిళలకు ఒక సవాలుతో కూడిన అంశమే' అంటారు షిఖా తన అనుభవాలను పంచుకుంటూ..
అవార్డులు
షిఖాశర్మ బ్యాంకుల లాభాలకు చేసిన విశేషకృషికి గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. 2012 ఎఐఎంఎ వారిచ్చిన 'బిజినెస్ లీడర్', 2012లో యుటివి ఫైనాన్స్ ఇచ్చిన 'ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్', ఇదే సంవత్సరం 'బిజినెస్ వర్డ్స్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్', మిలియన్ ఉమెన్ వంటి అవార్డులను పొందారు. 'వృత్తి పట్ల్ల అంకితభావం, ఆ సంస్థ తనదిగా భావించినప్పుడు మాత్రమే ఆ సేవలు కంపెనీ అభివృద్ధికి దోహదపడుతుందని' అంటారామె. ఇలాంటి మహిళలు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. వారిని గుర్తించి, తగిన ప్రోత్సాహం అందిస్తే, మనదేశ ఆర్థికాభివృద్ధిలో మొదటిస్థానంలో ఉంటుందనడంలో అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది అంటారు షిఖాశర్మ.
మూలం : వార్త దినపత్రిక