పుట్టుపూర్వోత్తరాలు
మంజుల 1953లో ఢిల్లీలో జన్మించారు. బోర్డర్ స్కూల్లో చదివిన మంజుల కళాశాల చదువు పూర్తి అయ్యాక రైటర్‌గా తన కెరీర్‌ను ఆరంభించారు. ఆరంభంలో చిన్నచిన్న కథల్ని రాయడంలో ఆసక్తి చూపిన మంజుల తర్వాత నాటకాలవైపు తన దృష్టిని సారించారు. 2008లో 'ఎస్కేప్ (తప్పించుకో) అనే పుస్తకాన్ని రాశారు. పత్రికల్లో కాలమిస్ట్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ఈమె రచనలు సండే అబ్జర్వర్‌లో ఎక్కువగా ప్రచురితమయ్యేవి. అంతేకాక మంజుల కార్టూనిస్ట్‌గా కూడా పనిచేశారు. నవ్వులను చిందించే కార్టూన్లను వేసి, ఆయాపత్రికలకు పంపేవారు.
నాటకానికి ఖ్యాతి
ఇలా చిన్నచిన్న కథల్ని ఒకవైపు రాస్తూ మరోవైపు కాలమిస్ట్‌గా పనిచేస్తూనే 1997లో 'హార్వెస్ట్' పేరుతో ఒక నాటకాన్ని రచించారు. ఈ నాటకానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించడమే కాక దాదాపు 250,000 పౌండ్ల బహుమతిని పొందారు. ఇది ఊహించని విజయమని మంజుల అంటారు.
క్షీణదశలో ఎగసిన కెరటం
సినిమాలు, టివి, సెల్‌ఫోన్, కంప్యూటర్లు రావడంతో నాటకాలు క్షీణదశకు చేరుకున్న సమయంలో మంజులా పద్మనాభన్ 1997లో రాసిన 'హార్వెస్ట్ నాటకం 76 దేశాల రచయితల నాటకాల్ని ఓడించి అవార్డును కైవసం చేసుకోవడం ఆశ్చర్యకరం. మొత్తం 1470 నాటకాల్లో మంజుల రాసిన 'హార్వెస్ట్' ప్రథమస్థానంలో నిలిచింది. ఈ నాటకానికి ఒనాసిస్ పబ్లిక్ బెనిఫిట్ ఫౌండేషన్ వారిచ్చే అంతర్జాతీయ బహుమతిని పొందారు. మంచి రైటర్ ప్లేరైటర్‌గా, జర్నలిస్ట్‌గా, కామిక్‌స్క్రిప్ట్ ఆర్టిస్ట్‌గా, పిల్లల కథల్ని రాసే రచయితగా పలు విభాగాల్లో పనిచేశారు. 1984లో 'లైట్స్‌అవ్ఞట్, హిడన్‌ఫైర్స్, ది ఆర్టిస్ట్స్ మోడల్ 1995లో రాశారు.
'హార్వెస్ట్' నాటకంతో ఉన్నఫళంగా మంజుల ప్రపంచ సాహితీవేత్తలలో ఒకరయ్యారు. 'ఫ్యాట్ అండ్ 44ఈజ్ ఫేమస్' అని చాలామంది ఆమెను అభినందించారు. మంజులా పద్మనాభన్ 44యేట ఈ గౌరవం సంపాదించుకున్నారు. ప్రపంచ దేశాలలో విస్తృతంగా పర్యటించిన అనుభవం ఉండడం వల్లనే ఈమె ఈ జాక్‌పాట్ కొట్టేశారనే ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఒనాసిస్ పబ్లిక్ బెనిఫిట్ ఫౌండేషన్ వారు అంతర్జాతీయ స్థాయిలో నాటక రచన పోటీ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రకటనని ఎప్పుడూ వర్ధమాన దేశాలకు పంపరు. అనుకోకుండా మంజుల ఆస్ట్రేలియా వెళ్లడం, అక్కడ ఈ పోటీ వివరాలు తెలుసుకోవడం, ఎప్పటినుంచో మెదడులో ఉన్న ఒక చిన్న ఆలోచనను సాహిత్యీ కరించడం, అన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయాయి. ఈమె నాటకంతో దేశానికి మరో అంతర్జాతీయ బహుమతి దక్కింది.
హార్వెస్ట్ దేనిగురించి వివరించింది?
మనసును కదిలించే అంశాలు, మనతో పయనించే విషయాలు ఈ నాటకంలో చాలాచోట్ల ఉన్నాయి. పేదలు తమ కడుపు ఆకలి మంటల్ని చల్లార్చుకునేందుకు దేహంలోని అవయవాల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. శరీరంలో ఉన్న అవయవాల ఖరీదు ఎంత విలువైనవో పేదలకు తెలియదు. వారికి తెలిసేది ఒక్కటే. ఒక్కరోజు భోజనాన్ని ఎలా సంపాదించుకోవాలి? రేపటిగురించి చింత లేదు. అందాక ప్రాణం నిలబడుతుందో లేదో తెలియదు. ఈరోజు ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే డబ్బు కావాలి. అందుకు ఏదో ఒక అవయవాన్ని అమ్ముకుంటారు. హార్వెస్ట్ (పంట) నాటకంలో విషయంలో చాలా అధునాతనమైంది. గుండె మార్పిడి, మూత్రపిండాల మార్పిడి, కళ్ల మార్పిడి, రక్తం మార్పిడి వంటివన్నీ అతి సహజంగా జరిగిపోతున్నా, ఈ సమాజంలో పేదవారి అవయవాలు ఉన్నవారికి ఉపయోగపడుతున్నాయి. పేద దేశాలవారి అవయవాలు ధనికదేశాల వారికి ఉపయోగపడుతున్నాయి. అంటే ఇక జీవసంబంధమైన అవయవాల పంట పండుతోందన్నమాట. దోపిడీ తీరు మారుతోంది. నిన్నటిదాకా శ్రమదోపిడి గొప్ప విషయంగా విరాజిల్లుతూ ఉండేది. ఇప్పుడు అంతకన్నా దారుణమైన దోపిళ్లు కొనసాగుతున్నాయి. హార్వెస్ట్ నాటకం ఒక ఊహాత్మక చిత్రణ. ఇందులో ముఖ్యపాత్రధారి మూడవ ప్రపంచ దేశాలకు చెందిన ఒక బీదవాడు. అతడు తన శరీరాన్ని మొత్తానికి మొత్తంగా ఒక విదేశీయుడికి అమ్మేస్తాడు. ఫలితంగా నాటకంలోని నాలుగు ప్రధానపాత్రల జీవితాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆమెకున్న అనుభవమే నాటకం
ఈ నాటకాన్ని రాసేందుకు మంజుల తనకున్న అనుభవాలే కారణమని అంటారు. 'మానవాంగాల మార్పిడి ఇతివృత్తంగా, నాటక రచనలో పోటీ ఉన్నట్లు తెలియగానే కొంత ఆసక్తి నాలో పెరిగిందని, ఎందుకంటే అవయవాలను దిగుమతి చేసుకునే ధనిక దేశాలతోనూ, ఎగుమతిచేసే బీద దేశాలతోనూ నాకున్న సత్సంబంధాలే కారణమని' పేర్కొన్నారు మంజుల. 'అందువల్ల ఆ ఇతివృత్తాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఒక మంచి నాటకంగా రూపుదిద్దగలనన్న ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. ఫలితం సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నింటినీ స్పృశిస్తూ 'హార్వెస్ట్' నాటకం రూపుదిద్దుకుంది' అని అన్నారు. యూరప్ దేశాలలో వలె భారతీయ రచయిత తమకు వచ్చే రాయల్టీతో, పారితోషికాలతో స్వతంత్ర జీవనం సాగించే అవకాశం లేదు. జీవనభృతికోసం తప్పకుండా మరో వృత్తి చేపట్టాల్సిందే! కావాలంటే ఏ నవలో రాయాలిగాని, కవిత్వం, కథ, నాటకం వంటి సాహితీ ప్రక్రియలకు డబ్బులు రావు. కవిత్వం, కథ వంటి ప్రక్రియలతో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులైనా లభిస్తాయి. నాటక రచనకు అదీ లేదు. మనదేశంలో పరిస్థితి చూస్తే మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలలో తప్పితే, ఇతర రాష్ట్రాలలో నాటక రచనకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. మన ఇండో ఆంగ్లికన్ రచయితలు కూడా ప్రధానంగా కవిత్వం మీదో, నవలమీదో దృష్టి సారిస్తూ వచ్చారేగాని నాటక రచనమీద కాదు. అందువల్ల మంజులా పద్మనాభన్ ఒక ఇంగ్లీషు నాటకం రాయడం పట్ల సాహితీలోకం ఆశ్చర్యపడాల్సి వచ్చింది. అది ఊహించనంత విజయం సాధించినందుకు అబ్బురపడాల్సి వచ్చింది. ఆధునిక ప్రపంచంలో సినిమా, టివి, కంప్యూటర్‌కు ఉన్నత ప్రాధాన్యత నాటకాలకు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మంజుల రాసిన నాటకానికి బహుమతి రావడం ఆ రంగం మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటుందని ఆశిద్దాం. - రూతు