
మాది మారుమూల గ్రామం. అమ్మాయిలకు రక్షణ తక్కువ. ఈ కారణాలతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేవారుకాదు. మా అమ్మానాన్నలు రోజు కూలీలే. కానీ నన్ను బాగా చదివించాలని కలలు కన్నారు. ఇబ్బంది అయినా బడికి పంపేవారు. నాకు పదేళ్లు ఉన్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. తట్టుకోలేకపోయా. బడికెళ్లడం మానేశా. అమ్మ ఓదార్చింది. 'నువ్వు చదువుకుని ఈ గ్రామం వాళ్లకీ దారి చూపిస్తావని నాన్న అనుకుంటే ఇలా చేస్తావేం..' అని కోప్పడింది. దాంతో స్కూలు దూరమైనా ధైర్యంగా వెళ్లేదాన్ని.
ఒకసారి దారి మధ్యలో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం చేయబోయాడు. అమ్మ నూరిపోసిన ధైర్యం గుర్తొచ్చింది. బ్యాగుతో బలవంతంగా అతని తలమీద కొట్టి తప్పించుకున్నా. తరవాత గ్రామంలోని అమ్మాయిలతో మాట్లాడితే 'ఇంట్లోంచి కాలు బయటపెట్టాక ఇలాంటి బాధలు చాలానే పడ్డాం' అని చెప్పారు. ఈ అన్యాయాని ఎన్ని రోజులు భరించాలి... కచ్చితంగా అడ్డుకోవాలి అనుకున్నా. వూళ్లో అమ్మాయిలందర్నీ ఒకచోటికి చేర్చాను. వేధింపులనీ, అఘాయిత్యాలనీ, బాల్యవివాహాల్నీ ఎదుర్కొందాం అని ధైర్యం నూరిపోశాను. అందర్నీ ఒప్పించడానికి రెండు నెలలు పట్టింది. 'నలుగురైదుగురు కలిసి వెళ్లండి. పుస్తకాల బ్యాగుల్నే ఆయుధాలుగా చేసుకోండి. చదువు మాత్రం మానొద్దు' అనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టా. దారికాచి అడ్డుకునే వాళ్లకి, బ్యాగులతో ఎలా బుద్ధి చెప్పొచ్చో శిక్షణ ఇప్పించా. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులతో మాట్లాడా. చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎన్ని సమస్యలొస్తాయో వైద్య నిపుణులతో చెప్పించా. అలా చాలా పెళ్లిళ్ళు ఆపగలిగా. కిందటేడాది ఇంటర్ పూర్తయింది. ఇప్పుడు మా సొంతూరు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో నా పేరు తెలియని వాళ్లుండరు. వేల మంది చదువుకునేలా స్ఫూర్తిని అందించినందుకు గాను యునిసెఫ్ 'నవజ్యోతి' అవార్డు నాకు లభించింది.