11 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పెద్ద పెద్ద వృక్షాలతో అలరారే ఆ అటవీ ప్రాంతాన్ని‘ కప్సి దొంగార్’ అంటారు. ఆ అడవి ఆమెకు ఆరో ప్రాణం. అది పచ్చదనంతో ఇంత సురక్షితంగా ఉందంటే అందుకు ఆమే కారణమని అటవీ అధికారులు సైతం ఒప్పుకుంటారు. వేటగాళ్లు, అడవి దొంగలు, కలప మాఫియా కళ్లెపుడూ ఆ అటవీ సంపదపైనే. వారి బారి నుంచి అడవిని కాపాడుతూ ఆమె తన కన్నబిడ్డలా సాకుతోంది. ‘‘చెట్లను రక్షించండి అవి మనల్ని రక్షిస్తాయి’’ అనే నినాదం చదువుకున్న వారే సరిగా పాటించక, ఇష్టానుసారంగా చెట్లను నరికేస్తున్న ఈ రోజుల్లో ఏ చదువులేని ఆ గిరిజన మహిళ మాత్రం ఆ నినాదం గురించి తెలియకపోయినా చక్కగా ఆచరణలో పెడుతోంది. ఇది తన భర్త ఇచ్చిన ఆస్తి అని చెబుతోంది. మజ్హి భర్త కూడా ఈ అడవిని కలప మాఫియా బారి నుంచి రక్షిస్తూ ప్రాణాలు వదిలాడు. పెళ్లయిన కొత్తలో భర్త రోజూ కూలి పనికి వెళ్లి డబ్బు సంపాదించకుండా లాఠీ పట్టుకొని అడవిని సంరక్షించటం ఆమెకు నచ్చేదికాదు. అడవి సురక్షితంగా ఉంటేనే మనకు అన్నం దొరుకుతుందని భర్త చెబితే ఎగతాళి చేసేది. విచక్షణా రహితంగా చెట్లను నరికేసి అక్రమంగా తరలిస్తున్నందున సర్వం కోల్పోయ నిరాశ్రయులవుతామనే విషయం ఆమెకు కొద్దిరోజుల్లోనే ఆర్థమైంది. ఆ అడవినే నమ్ముకుని నివసించే గిరిజనుల్లో దాదాపు 65 శాతం మందికి ఆ భూమిపై హక్కు లేకపోయినప్పటికీ రాగి, జొన్నలు పండించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ సంపదను సంరక్షించుకోకపోతే అడవి స్మగ్గర్ల పాలవుతోందని తెలుసుకుంది. అందుకే గొడ్డలి చేతబట్టి ఆమె కార్యరంగంలోకి దిగింది. ఓ రోజు రాత్రి అడవి కాపలాకు వెళ్లిన ఆమె భర్త అనంగ్ కనిపించకుండా పోయాడు. చుట్టుప్రక్కల వారి సాయంతో అడవంతా గాలించగా తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న భర్త కనిపించాడు. చెట్లను నరికే కలప దొంగలు అతడిని తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. సకాలంలో వైద్యం అందక అతను ప్రాణాలు వదిలాడు. ప్రాణాలు వదులుతూ అడవిని రక్షించమని భార్య నుంచి మాట తీసుకున్నాడు. ఆడదానివి అడవిని నువ్వేం రక్షిస్తావని అంతా ఎగతాళి చేసినా ఆమె పట్టువీడలేదు. దినచర్యలో భాగంగా తెల్లవారుజామునే గొడ్డలి చేతబట్టి గంటసేపు అడవంతా తిరిగివస్తుంది. చుట్టుప్రక్కల ఇళ్లలో పనిచేసి వారిచ్చే జీతంతో ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెళ్లి చేసింది. కొడుకు కూడా చేతికి అందివచ్చాడు. గత 30 ఏళ్లుగా ఆమె అడవికి కాపాలా కాస్తోంది. ఒక్కొక్కసారి రాత్రివేళ అడవిలోనే ఉంటుంది. 2001 తరువాత అటవీశాఖ ఏర్పాటు చేసిన వనసంరక్షణ సమితికి ఆమే నాయకురాలు. ఆమె సేవలను గుర్తించి ఒడిషా ప్రభుత్వం 2010-11లో ‘ప్రకృతి బంధు’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆమె జీవనోపాధికిగానూ అటవీశాఖ 2వేల రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తోంది. వృక్షాలనే తన బిడ్డలుగా చూసుకుంటూ కాపలా వృత్తిలో కాలం వెళ్లదీస్తోంది. ఆమె ప్రకృతిని ప్రేమిస్తుంది, ఆ ప్రకృతే ఆమెను కాపాడుతుందని కరియార్ జిల్లా అటవీ అధికారి శరత్ చంద్ర పండా అంటారు. ఆమె నిబద్ధత మిగతా వనసంరక్షణ సమితులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అటవీ అధికారులు ప్రశంసిస్తుంటారు.
మూలం : ఆంధ్రభూమి