బతుకు చీకట్లతో పోరాడి గెలిచిన అశ్వనికి...
తేడా ఏం లేదు.
ఆడపిల్లల చదువు కోసం ఫైట్ చేస్తున్న మలాలాకు...
తనలా అంధులైన పిల్లల చదువు కోసం సర్వీస్ చేస్తున్న అశ్వనికి...
తేడా ఏం లేదు.
ఇద్దరూ సమస్యలను సవాల్‌గా తీసుకున్నారు.
ఇద్దరూ తమ ఈడు పిల్లలకు ఆదర్శంగా నిలిచారు.
అమ్మాయిలు ఇంతింత సాహసాలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది!
వారి తల్లిదండ్రులకు సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంది.
మలాలా గురించి ప్రపంచమంతటికీ తెలుసు.
‘మలాలా అవార్డు’ అందుకున్న అశ్వని గురించి తెలుసుకోవాలంటే మాత్రం
నేరుగా ఆమె అమ్మానాన్నలనే అడగాలి.
అదొక ఇన్‌స్పైరింగ్ స్టోరీ. అదొక ‘లాలిపాఠం’!
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామం చేళ్లగుర్కి ప్రకాశ్ అంగడి స్వస్థలం. వ్యవసాయం మీద ఆధారపడిన ఉమ్మడి కుటుంబం వీరిది. ఒక ఏడాది తీవ్రమైన కరువు రావడంతో పొట్ట చేతబట్టుకుని భార్య వేదవతితో బెంగళూరు బాట పట్టారు ప్రకాశ్. అద్దె ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఇద్దరబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేలోపే ఆ చిన్నారికి చూపులేదని తెలిసింది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘అశ్వనికి చూపులేదని డాక్టర్లు చెప్పగానే అశ్వని భవిష్యత్తును ఊహించుకుంటూ చాలా బాధపడ్డాను. చూస్తుండగానే అశ్వనికి నాలుగేళ్లు వచ్చేశాయి. చూపులేదనే మాట తప్ప మిగతా అన్ని విషయాల్లో తను చాలా చురుగ్గా ఉండేది. బళ్లో చేర్పించాలనుకుంటున్న తరుణంలో నగరంలోని రమణ మహర్షి ఆశ్రమ పాఠశాల గురించి విన్నాం. అక్కడ అంధుల కోసం ప్రత్యేక లిపిలో పాఠాలు చెబుతారని, హాస్టల్ సదుపాయం కూడా ఉందని తెలుసుకున్నాం’’ అంటూ ఆగారు వేదవతి.
గుండె దిటవు చేసుకున్నాం...
అశ్వనిని నాలుగేళ్ల వయసులోనే హాస్టల్‌కు పంపించడానికి మానసిక సంఘర్షణకు గురయ్యామని చెబుతూ... ‘‘అప్పట్లో మేం బ్యాటరాయణపురలో ఉండేవాళ్లం. అశ్వనిని చేర్పించాల్సిన స్కూల్ జయనగరలో ఉంది. రోజూ అశ్వనిని అంత దూరం తీసుకెళ్లి తీసుకురాలేక హాస్టల్‌లో చేర్పించామన్న మాటే కానీ మా మనసంతా ఆమె చుట్టూనే ఉండేది. శనివారం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాళ్లం. ప్రతి శనివారం ఇంటికి తీసుకువచ్చి మళ్లీ సోమవారం హాస్టల్‌లో వదిలేవాళ్లం’’ అని చెప్పారు ప్రకాశ్.
పట్టుదల ఎక్కువే!
అశ్వనికి పట్టుదల ఎక్కువేనంటూ టెన్త్‌పరీక్షల సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ప్రకాశ్. ‘‘అశ్వనికి చిన్నతనంలో తరచూ జబ్బు చేసేది. టెంత్ పరీక్షల ప్పుడు తీవ్ర అనారోగ్యం పాలైంది. అయినా సరే, పరీక్షలు రాయాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో రోజూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించి, పరీక్ష హాల్‌కు తీసుకెళ్లేవాళ్లం. పరీక్షలు ఆ పరిస్థితిలో రాసి కూడా 85 శాతం మార్కులతో పాసైంది. పీయూసీకి ఎన్‌ఎంకేఆర్‌వీ కాలేజ్‌లో చేర్పించాం. రోజూ ఎవరో ఒకరం కాలేజ్‌కి తీసుకెళ్లి, సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాళ్లం. ఒకరోజు మాకోసం ఎదురుచూడకుండా తనంతట తానే ఇంటికి వచ్చేసింది. ‘ఏదైనా జరిగుంటే’ అని మందలించా. కానీ తను ‘నాన్నా నేను రోజూ వెళ్లివస్తున్న దారేగా, ఒక్కదాన్నే రాగలను, భయంలేదు’ అంది. మానసికంగా తనెంత దృఢంగా ఉందనేది నాకప్పుడే అర్థమైంది’’ అన్నారు ప్రకాశ్.
డిగ్రీ సీటు కోసం పాట్లు!
అశ్వనిని డిగ్రీలో చేర్పించడానికి బెంగళూరు మహారాణి కళాశాలకు వెళ్లినపుడు ‘అశ్వని ఫెయిల్ అయితే తమ కాలేజ్‌కి చెడ్డపేరు వస్తుందని, తనకేమైనా జరిగితే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని’ సీటివ్వడానికి ససేమిరా అన్న సంఘటనను వివరించారు ప్రకాశ్. ‘‘అశ్వనికి సీటివ్వమని ప్రిన్సిపాల్‌ని కన్నీళ్లతో వేడుకున్నాను. అశ్వని పరీక్షల్లో ఫెయిల్ అయితే అదే క్షణం ఇంటికి తీసుకెళతానని, ఏం జరిగినా బాధ్యత తీసుకుంటానని హామీపత్రం రాసిచ్చిన తర్వాత చేర్చుకున్నారు. నా బిడ్డ ఎటువంటి ఇబ్బందీ తీసుకురాలేదు, పైగా ర్యాంక్ స్టూడెంట్ కూడ’’ అని తన గారాల పట్టి గురించి చెప్పారు ప్రకాష్.
సేవకే అంకితమవుతానంది... సరే అన్నాం...
అశ్వనికి ఐటీ సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో చేరకుండా తన ఆశయాన్ని బయటపెట్టింది. అదే విషయాన్ని చెబుతూ ‘‘అశ్వనిలో చిన్నప్పటి నుండి సామాజిక స్పృహ ఎక్కువే. ప్రభుత్వం నెలనెలా తనకిచ్చే పెన్షన్‌డబ్బు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన వారికిచ్చేది. తనకంటూ ఆధారం లేకపోతే రేపటిరోజున పరిస్థితి ఏంటని భయపడ్డాం. తనలాంటి నలుగురికి ఆధారంగా నిలవడంలోనే తృప్తి ఉందని మాకు నచ్చజెప్పి ఒక స్వచ్ఛందసంస్థలో వాలంటీర్‌గా చేరి ఎంతోమందిని విద్యావంతులుగా చేయడానికి కృషి చేస్తోంది. ఆమె ఎంచుకున్న మార్గమే ఈరోజు ఇంత గౌరవాన్ని తెచ్చింది’’ అన్నారాదంపతులు.
కష్టాలను ఓర్పుతోనే దాటాలి! కష్టాలకు ఓర్చుకుంటూ విజయ తీరాల వైపు ప్రయాణించాలని పిల్లలకు నేర్పుతూ వచ్చామని ప్రకాష్ తెలిపారు. శివ, అశ్వని, ప్రేమ్ ముగ్గురూ తమ కాళ్లపై తాము నిలబడ్డానికే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారాయన. ‘‘పుట్టి పెరిగిన ఊళ్లో కరువు రావడంతో పొట్ట చేతపట్టుకొని బెంగళూరుకు వచ్చినప్పుడు మంచినీళ్లు తాగి కడుపునింపుకున్న రోజులను, రేయి- పగలు అనే తేడా లేకుండా ఆటో నడిపిన సంగతినీ చెప్తూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని వదులుకోలేదని గుర్తు చేసేవాడిని. వాళ్లు కూడా కాస్తంత వయసొచ్చాక నా మీద ఆధారపడలేదు. పెద్దబ్బాయి శివ... కుటుంబ ఆర్థికపరిస్థితుల దృష్ట్యా పి.యు.సి మధ్యలోనే వదిలేసి, నాతో కలిసి ట్రావెల్స్ ఏజన్సీ నిర్వహణ చూసుకుంటున్నాడు. అశ్వని అయితే రికార్డులకోసం మాపై ఆధారపడేది కాదు, కాలేజ్‌లో చెప్పే పాఠాలను రికార్డ్ చేసుకొని వచ్చి ఇంట్లో నోట్స్ ప్రిపేర్ చేసుకునేది. ఇక అశ్వని తమ్ముడు ప్రేమ్ బిఏ చేసి బెస్కామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. నా బిడ్డలందరూ నాకు చేదోడువాదోడయ్యారే తప్ప ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎప్పుడూ లేవు’’ అని చెప్పారు ప్రకాష్.
బాహ్యప్రపంచాన్ని చూడలేని తమ బిడ్డ మనోనేత్రంతో ప్రపంచాన్ని చూడగలదు అని నిరూపించిన తల్లిదండ్రులు ప్రకాశ్, వేదవతి. వారందించిన చేయూతతో తనలాంటి వారెందరికో చూపుగా నిలుస్తోంది అశ్వని.
అశ్వని విజయాలు!
- మహారాణి కళాశాలలో అంధుల కోసం ప్రత్యేకమైన పుస్తకాల అవసరాన్ని యాజమాన్యానికి వివరించారు. ప్రస్తుతం ఆ కాలేజ్‌కి బ్రెయిలీ బుక్స్, కంప్యూటర్ స్క్రీన్ రీడర్‌లు కూడా వచ్చాయి.
- విభిన్న ప్రతిభావంతుల హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న ‘లియోనార్డ్ ఛెసైర్ డిసెబిలిటీ’ (ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది) సంస్థలో 2011 జూలైలో సాధారణ వాలంటీర్‌గా చేరారు. కొద్ది కాలంలోనే నేషనల్ ఫెసిలిటేటర్‌గా ఎదిగారు.
- నగరంలోని వివిధ కళాశాలల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం అందుబాటులోకి తీసుకురావాల్సిన వసతులపై ఆయా కళాశాలలయాజమాన్యాలతో చర్చించి సౌకర్యాలను ఏర్పాటుచేయించారు.
- రాంచీలో ఆమె వెళ్లిన సమావేశానికి హాజరైన 90 మందిలో ఒక్కరు కూడా పాఠశాలకు వెళ్లడం లేదు. చదువు ఆవశ్యకత, బ్రెయిలీ లిపి వంటి సౌకర్యాల గురించి అశ్వని ఇచ్చిన కౌన్సెలింగ్‌తో స్ఫూర్తి పొంది ఆరోజే వారంతా స్కూల్లో చేరారు.
- ఈనెల 12న న్యూయార్క్‌లోని యునెటైడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మలాలా డే’ కార్యక్రమంలో అశ్వనిని అభినందించి, విభిన్న ప్రతిభావంతులైన బాలికల విద్యకోసం ఆమె చేస్తున్న కృషికి ‘యూత్ కరేజ్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్’తో ఐక్యరాజ్యసమితి సత్కరించింది.
అమ్మానాన్నలే నా కళ్లు!
నా తృప్తి కోసమే ఇదంతా చేస్తూ వచ్చాను. నేను కావాలన్నదానికి నా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. నాకు రెండు కళ్లుగా మారి నేను ఎంచుకున్న బాటలో నడిపించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కరువైన ఎంతోమంది విభిన్న ప్రతిభావంతులు, ముఖ్యంగా అమ్మాయిలు ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వాళ్లను విద్యావంతులుగా చేయాలనేదే నా లక్ష్యం.
- అశ్వని,
మూలం : సాక్షి దినపత్రిక