సభ్యసమాజానికి చాటిచెప్పింది. ఒక్క కలం చాలు ఈ సమాజాన్ని మార్చేందుకు అని నమ్మిన ఆమె ఆ కలమే తన ఆయుధంగా మలచుకుని అహర్నిశలు శ్రమించారు. ఆమె ఎవరో కాదు మహాశ్వేత సుగథకుమారి మృణాల్ పాండే.
బీహార్ రాష్ట్రంలోని 'ముండాజాతి' ఆదివాసుల దుర్భరజీవనాన్ని కళ్లకు కట్టిపడేసే సన్నివేశాలను రచనల ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు నవలలు, కథలే తన జీవితంగా భావించి శ్రమించారు. ఆమె శ్రమను గుర్తించిన కేంద్రప్రభుత్వం 'పద్మవిభూషణ్' అవార్డుతో సత్కరించింది. ఆరుదశాబ్దాలుగా రచనలు చేస్తున్న మహాశ్వేత కృషిని కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించినా, రచనల్లో అరుదైన అవార్డును పొందిన తొలి మహిళా రచయిత కావడం విశేషం. బీహార్‌ప్రాంతపు 'ముండాజాతి' ఆదివాసులతో కలిసి జీవించి వారిని వెట్టిచాకిరి నుంచి బంధవిముక్తులను చేయడానికి అహరహం కృషి చేశారు. అదే ఇతివృత్తంతో అనేక నవలలు కథలు రాశారు. కొన్ని తెలుగులోకి అనువాదమయ్యాయి కూడా!
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా...
మహాశ్వేతాదేవి మంచి సాహిత్య వాతావరణంలో పుట్టారు. సృజనాత్మక పరిసరాలలో పెరిగారు. తండ్రి మనీష్ ఘటక్ ప్రముఖ బెంగాలీ రచయిత నూతనపంథాలో వినూత్న రచనలు చేసిన ఆనాటి కొల్లోల్ సాహిత్య కూటమిలో పేరెన్నికగన్నారు. తల్లి ధరిత్రీదేవి. భారతీయ సమాంతర సినిమాకు ఆద్యుడైన రిత్విక్ ఘటక్ ఆమెకు దగ్గరి బంధువు. ఇలాంటి కుటుంబం నుండి వచ్చిన మహాశ్వేత బిజిన్ భట్టాచార్యను వివాహ మాడారు. నటుడిగా నాటక ప్రయోక్తగా ఆయనకు బెంగాల్‌లో పెద్దపేరు 'రచయిత్రిగా, సమాజసేవికగా, అధ్యాపకురాలిగా, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్'గా మహాశ్వేతాదేవి వివిధ భూమికలు నిర్వహించారు. అందుకు ఆమె కుటుంబనేపథ్యం ఎంతగానో ఉపకరించింది. మనీష్‌కు తగిన కూతురని బిజిన్‌కు తగిన సహధర్మచారిణి అని అనిపించుకున్నా వారి ప్రభావాలు తన మీద పడకుండా తనదైన విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆమె నిలబెట్టుకున్నారు. 1926 జనవరి 14న ఢాకాలో జన్మించిన మహాశ్వేత బాల్యం కలకత్తాలోని శాంతినికేతన్‌లో గడిచింది. ఆడుతూపాడుతూ చదువుకుని ఆంగ్ల సాహిత్యంలో ఎంఎ పట్టా సాధించారు. మొదట్లో కొంతకాలం కేంద్రప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్‌గా, తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసి కళాశాల అధ్యాపకురాలిగా స్థిరపడ్డారు.
సమాజ పరిశీలనే ఓ అభిరుచిగా
మహాశ్వేత ఏ ఉద్యోగంలో ఉన్నా సమాజ పరిశీలన మాత్రం మానలేదు. రచనా వ్యాసంగం ఆపలేదు. బెంగాలీ ఇంగ్లీషు మాత్రమేగాక ఆదివాసులతో తిరిగి సంతాలీ భాష కూడా నేర్చుకున్నారు. ఒరియా హిందీలలో ప్రావీణ్యం గడించారు. 'వార్తిక' అనే బెంగాలీ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ యోజన, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీలలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు. ఆదివాసీలను జనజీవన స్రవంతిలో కలుపుకోవా ల్సిన అవసరాన్ని ఎత్తి చూపారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయస్థాయి సెమినార్లలో కూడా ఆమె ఈ విషయం ఎన్నోసార్లు చెప్పారు. అందుకామె అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. సాహిత్య కృషి కొనసాగిస్తూనే సమాంతరంగా సామాజిక బాధ్యతల్ని ప్రత్యక్షంగా నెత్తిన వేసుకునే రచయితలు చాలా తక్కువమంది ఉంటారు. ఆ తక్కువమందిలో మహాశ్వేతాదేవి పేరును మొదటి వరసలో చెప్పుకోవాల్సి ఉంటుంది.
పిల్లలపై రచనలు
ఇక ఆమె సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే ఒక జీవితకాలంలో ఇంత కృషి చేయడానికి వీలవుతుందా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. పిల్లలకోసం కథలు, నాటికలు రాయడమే కాదు సుమారు ముప్పయి పాఠ్యపుస్తకాలకు రూపకల్పన చేశారు. 1956లో ఆమె తన ముప్పయవ యేట 'ఝాన్సీరాణి జీవితచరిత్ర' రాశారు. విప్లవనారి జీవిత లక్ష్యం ఎలా ఉండాలో చెప్పే ఈ మొదటిరచన మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందామెకు. అప్పటి నుంచి 1996 దాకా అంటే డెబ్బయియేళ్ళ వయసుకు చేరుకునే వరకు ఆమె కలం అలసిపోలేదు. బాధ్యతతో పదునెక్కి భావోద్వేగంతో పరిగెత్తింది. ఆ పరుగు వంద పుస్తకాలలో నిక్షిప్తమై ఉంది.
పాఠకుల్ని ఆకర్షించిన రచనలు
ఆమె రాసిన వంద కథానికలు బెంగాలీభాషలో ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి. నటి (1957) చెల్లెబేలా-టాగూర్ రంగ్‌మహల్ (1959) సాంఝ సకలార్ మా-వంటి రచనలు పాఠకుల్ని విశేషంగా ఆకర్షించాయి. బెంగాలీకవి బందోఘట్టి జీవితం ఆధారంగా కవి బందోఘట్టి ఘన్‌ఈర్ జిబన్ ఓ మృత్యు (1967) అనే నవలలో ఆ కవి చావుబతుకుల్ని అద్భుతంగా చిత్రించింది. చీకట్లో మెరిసే రత్నం-ఆధార్ మనిక్ (1967) హజర్ చౌరాశిమా (1974) సాల్ గఠార్ ఢాకే (1982) అగ్నిగర్భ (1978) చొట్టిముండా విచాంగ్-భారతీయ (1980) వివిక బిడార్ పలిగణేశ్ మహిమ (1981) ఎత్తిర్ పారె ఇట్ (1982) వంటి నవలలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా 'అరణ్యార్ అధికార్' నవల గొప్ప సంచలనాన్ని సృష్టించింది. అడవిలో జీవించే హక్కు మాకుంది అన్న ఆదివాసుల ఆత్మఘోషను ఆమె ఆ నవలలో పలికించారు. ఆదివాసుల వెట్టిచాకిరిని ప్రశ్నిస్తూ ఆమె హిందీలో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు 'భారత్ మె బంధువా మజ్దూర్'.
జ్ఞానపీఠ, రామన్‌మెగసెసే అవార్డులు
'ప్రజల మధ్యకు వెళ్ళండి. వాళ్ళ జీవిత సత్యాలను తెలుసుకోండి' అని యువతరానికి హితవు చెప్పిన ఈ రచయిత్రి సాహిత్యం ద్వారా సమాజానికి చేస్తున్న సేవను భారతప్రభుత్వం ఇతర సంస్థలూ గుర్తిస్తూనే ఉన్నాయి. 1979లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1980లో జ్ఞానపీఠ అవార్డు స్వీకరించిన మహాశ్వేతాదేవి అంతకు ముందు లీలా అవార్డు శరత్‌చంద్ర మెడల్, బూబన్ మోహినీదాస్ మెడల్ (కలకత్తా విశ్వవిద్యాలయం) అమృతా అవార్డు తారా శంకర్ అవార్డు రామన్‌మెగసెసే అవార్డు వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎన్ని పురస్కారాలు స్వీకరించినా ఆమె తన లక్ష్యాన్ని మరచిపోలేదు. సాహితీవేత్తగా సామాజిక కార్యకర్తగా తన జీవితాన్ని సమాజానికి అర్పిస్తూపోయారు. వ్యక్తిగత జీవితంలో ఒకే ఒక కుమారుడికి తల్లయిన మహాశ్వేత సామాజిక జీవితంలో లక్షలాది ఆదివాసులకు 'మహామాత' అయ్యారు. వారిని వెట్టిచాకిరి నుంచి తప్పించి వారి జీవితాలకొకదారి చూపించ గలిగారు. భారతీయ సాహిత్య చరిత్రలో చెమటను, నెత్తురునూ పట్టించుకుని మరెవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగి జగతినిండా శాంతిని మానవత్వాన్ని పరచిన 'మహాశ్వేత' ఆమె!
మూలం : వార్త దినపత్రిక