అడవిని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఆడవారిని అడ్డం పెట్టుకొనే కొన్ని దుష ్టపన్నగాల పన్నాగాలకు ఏడోనెల కడుపునూ డాలుగా అడ్డుపెట్టి ఎదురొడ్డి పోరాడే మహిళలు వీళ్లు.
కలపదుంగల్ని కొందరు కలపదొంగలు నిలువునా పెరికేసి, అడ్డంగా నరికేసి, చుట్టూ ఉన్న చెట్టూ చేమను నెమరేసేందుకు అడవి నుంచి తరలిస్తుంటే అడ్డుపడే సబలలు వీళ్లు.
వానల్లో తడుస్తూ, చీకట్లో నడుస్తూ అడవి జీవుల అరణ్య రోదనలకు ఓదార్పునిస్తున్నందుకు మమ్మల్ని పురుగూ ముట్టదు, పామూ కుట్టదంటారు వాళ్లు.
పచ్చని ఆకే వాళ్లకు గొడుగు.
నెగడు కాంతే వాళ్లకు వెలుగు.
అరణ్యఛత్రం పచ్చగా పదికాలాలు పదిలంగా పరచుకుని ఉండేందుకు కానల నలు చెరగులా విస్తరించి కాపలా కాస్తున్న ఆ సబలలకు మా సలాం.
వీరప్పన్ల పనిపట్టే వారి వీర పనులకు మరో సలాం.
వీళ్ల కథలు చదివితే మీరూ చేస్తారు మాలాగే శాల్యూట్.
ఆ అమాయకపు స్త్రీలంతా అడవి తల్లి బిడ్డలు. తమను ప్రలోభపెట్టే కుటిలాత్ముల మాటలను నమ్మేశారు. అడవి భూములను కమ్మేశారు. అక్రమ ఆక్రమణ ప్రయత్నాలకు తమకు తెలియకుండానే సహకరించడానికి పూనుకున్నారు. ఆడవాళ్లను ముందు పెట్టుకునే వాళ్ల కుట్రలను ఎదుర్కోవడానికి మహిళా సిబ్బంది ముందుకు రాక తప్పలేదు. తమ విధినిర్వహణలో మరింత ముందుకు దూసుకుపోకా తప్పలేదు.
స్థలం... ఖమ్మం జిల్లా కొత్తగూడెం... అక్కడ అడవికి ఆనుకుని ఉన్న భూముల్ని ఆక్రమించుకోమని గిరిజనుల్ని ఎవరో రెచ్చగొట్టారు. దాంతో వారు ఓ అర్ధరాత్రిపూట వచ్చి చెట్లన్నీ నరికి, అక్కడే పాగావేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ...వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. గిరిజనులు కుదరదన్నారు. వారిలో చాలామంది మహిళలే ఉన్నారు. అక్కడికొచ్చిన అటవీశాఖ సిబ్బందిలో అందరూ మగవాళ్లే ఉన్నారు. లాఠీలతో బెదిరించడానికి ప్రయత్నిస్తే మహిళలపై దౌర్జన్యం అంటూ విరుచుకుపడ్డారు. దాంతో అడవి చుట్టుపక్కల రేంజ్‌లలోని మహిళా సిబ్బందికి కబురు పెట్టారు. తెల్లవారుజామున ఐదింటికల్లా ఓ తొమ్మిదిమంది మహిళా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘‘మేం చూస్తే పదిమంది కూడా లేం.
భూమిని ఆక్రమించడానికి వచ్చిన మహిళల సంఖ్య వందకు పైగా ఉంది. మేం లాఠీలు పట్టుకుని వారిని తరమడానికి ప్రయత్నించాం. వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ... మాపై ఎదురుదాడికి దిగారు. ఆ దాడిలో ఒక బీట్ ఆఫీసర్ దుస్తులు చిరిగాయి. ఒకరిద్దరికి కాళ్లకు గాయాలయ్యాయి. ఒకరికి గాజులు గుచ్చుకుపోయాయి. ఆ భూమి సంగతి దేముడెరుగు... మమ్మల్ని మేం రక్షించుకోడానికి తలప్రాణం తోకకొచ్చింది. మాతోటి ఆఫీసర్లు అక్కడే ఉన్నా... మగవారు కావడం వల్ల గిరిజన మహిళలపై చేయి చేసుకోకూడదు కాబట్టి వారుండి కూడా ఏం చేయలేని పరిస్థితి అయ్యింది. అలా ఒకరోజు... రెండు రోజులు కాదు నెలరోజులపాటు వారిని అడ్డుకుంటే అక్కడి నుంచి కదిలారు’’ అని కొత్తగూడెం రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అప్సర చెబుతున్నప్పుడు... కొన్ని వాస్తవాలు అడవికే పరిమితమైపోతుంటాయనిపించింది.
నిజానికి అడవి చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణల పాలవ్వడం సాధారణ విషయం. కాని వాటిని రక్షించడం... ఆ ప్రయత్నంలో మహిళా సిబ్బంది పడేపాట్లు...ఎంత క్లిష్టంగా ఉంటాయోననడానికి ఈ కొత్తగూడెం సంఘటన ఒక ఉదాహరణ. భూమొక్కటే కాదు... చెట్టు చేమ, పురుగూ పుట్రా...అన్నింటినీ కాపాడాలి వీరు. అడవితల్లికి కంచెగా మారి మగవారితో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందితో మాట కలిపితే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అటవీశాఖలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అడవికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఏ క్షణాన అవసరమైనా ఆగమేఘాలపై వచ్చి అడవిలో వాలిపోవాలి. ఖమ్మం జిల్లాలో ఒక్కోరేంజ్‌కి ఇద్దరుముగ్గురు మహిళా సిబ్బంది ఉన్నారు. వీరి ఇష్టాల సంగతి అటుంచితే అటవీ సంపదను దోచుకోవడంలో మహిళల పాత్రని చూస్తే ఈ శాఖలో మహిళా సిబ్బంది అవసరం చాలా ఉందని తెలుస్తోంది. అవసరానికి తగ్గట్టుగానే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.
అడవంటే ఇష్టం...
‘‘అటవీ భూముల్ని ఆక్రమించడం నుంచి వన్యప్రాణుల్ని చంపి తెస్తే వండి వడ్డించే వరకూ మహిళల పాత్ర పెరిగిపోతోంది. వారిని అడ్డుకోవాలంటే ఈ శాఖలో మహిళా సిబ్బంది అవసరం చాలా ఉంది. మగవాళ్లతో సమానంగా పనిచేయడంతో మాపనైపోవడంలేదు. స్పాట్‌లో మహిళలున్నారని తెలిస్తే చాలు అర్ధరాత్రయినా ఫోన్ మోగుతుంది. వెంటనే జీపు ఎక్కాల్సిందే. మళ్లీ ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతకడానికి అటవీశాఖని ఎంచుకోలేదు. అందరం కూడా ఇష్టపడి వచ్చాం కాబట్టే కష్టపడి చేస్తున్నాం. మేం ఏ అడవి చుట్టుపక్కలుంటే అక్కడే మా పిల్లలు చదువుకోవాలి. మహిళా సిబ్బంది తక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కువ సెలవులు పెట్టే అవకాశం కూడా ఉండదు. ఇంట్లోవారి ప్రోత్సాహం, సహకారం ఉంటేనే తప్ప ఇలాంటి రిస్కీ జాబ్ చెయ్యలేం. అడవి కాపలా ఒక్కటే కాదు... కదా! బీడు భూముల్లో చెట్లు నాటడం నుంచి ఏ చెట్టుమీదా గొడ్డలి పడకుండా చూడ్డం వరకూ... అంతా మా పనే. ఉద్యోగమనుకుంటే ఒక్క గంట కూడా ఇక్కడ ఉండలేం. అడవిని ఇల్లులా కాపలా కాస్తేనే పచ్చగా ఉంటుంది. లేదంటే మర్నాడే మాయమైపోతుంది’’ అని చెప్పారు రామవరం రేంజ్ ఆఫీసర్ మంజుల.
అర్ధరాత్రులు...రైడింగ్
మగవారి తోడున్నా... అర్ధరాత్రులు అడవిలో ప్రయాణమంటే కష్టమేకదా అంటారు అక్కడే బీట్ ఆఫీసరుగా పనిచేస్తున్న విజయలక్ష్మి. ‘‘మొన్నామధ్య జరిగిన భూపోరాటం సమయంలో రాత్రిపూట కూడా కాపలా ఉండాల్సి వచ్చింది. మాతోపాటు మగవాళ్లు ఉన్నా కూడా ఏం జరుగుతుందోననే భయం ఉంటుంది కదా! దీంతోపాటు రైడింగ్‌లు కూడా ఉంటాయి. అక్రమంగా కలప దొంగిలించి రహస్యప్రాంతాల్లో దాస్తుంటారు. వాటిని వెతికిపట్టుకోవడం పెద్ద చాలెంజింగ్ జాబ్. ఏ సమయంలో వెళితే బయటపెట్టగలమో తెలుసుకుని అప్పుడు సిబ్బంది అంతా వెళ్లి కలపదొంగల్ని పట్టుకుంటాం. అలా చాలా రైడింగ్‌లు విజయవంతంగా నిర్వహించాం. అలాంటప్పుడు చాలా గర్వంగా ఫీలవుతాం. అలాగే అడవిలో ఎవరైనా చెట్లు నరికేస్తున్నారని తెలిస్తే... ఆగమేఘాల మీద అక్కడ వాలిపోతాం. ఒక్కచెట్టు రక్షించబడ్డా ఏదో సాధించినట్టు అనుకుంటాం. అడవిలో మేం వెళ్లే దారుల్లో కనిపించే చెట్లలో మర్నాడు ఒక్కచెట్టు కనిపించకపోయినా మా కళ్లు కనిపెట్టేస్తాయి. అడవితో మాకు అల్లుకుపోయిన బంధం అది’’ అని చెప్పారామె.
‘‘మా అడవిలోని జంతువులకి ఎవరిని ఏమనాలో తెలుసండి. మేం రాత్రింబవళ్లు వాటి రక్షణకోసమే కష్టపడుతున్నామని వాటికి తెలుసు (నవ్వుతూ..). అందుకే ఇన్నేళ్లలో వాటి నుంచి మాకు ఎటువంటి అపాయం రాలేదు. పాము కనిపించినా... మరే ఇతర క్రూరజంతువు కనిపించినా అక్కడి నుంచి మెల్లగా తప్పుకుంటాం తప్ప హాని తలపెట్టం. మా కళ్లు కప్పి జింకల కోసం, నెమళ ్లకోసం తిరిగే దొంగలు చాలామంది ఉంటారు. అలాంటివారిని పట్టుకోవడం చాలా కష్టం. దొరికిన వాళ్లు వెంటనే లొంగిపోతారా అంటే కాదు...ప్రలోభాలు, బెదిరింపులు. మా బిడ్డల్ని ఎత్తుకెళ్లినట్లు ఫీలైతేగాని అలాంటివాళ్లని మేం ఎదుర్కోలేం’’ అంటారు అప్సర.
ఇలా ఆక్రమణల నుంచి అపహరణల వరకూ అడవిలోని బాధలన్నీ చెప్పుకొచ్చారు ఖమ్మం అటవీశాఖలోని మహిళా సిబ్బంది. పొట్టకోసమే అయితే ఇన్ని తిప్పలు అవసరం లేదు. ఎంతో పట్టుదలతో పనిచేయాలనుకునేవారే ఇలాంటి రంగాల్ని ఎంచుకుంటారు. ప్రతిరోజూ తొలిరోజు ఉద్యోగంలా చేస్తారు. ప్రతి విజయాన్నీ తొలివిజయంగా భావిస్తారు. ఆ భావనతోనే జీవిస్తారు.
ప్రస్తుతం విజయలక్ష్మి ఏడోనెల గర్భవతి. అయినా అడవిలో ప్రయాణం తనకు అడ్డుకాదంటోంది. కొత్తగూడెం అడవిలో ఎక్కువగా ఎలుగుబంట్లు, అడవి దున్నలు తిరుగుతుంటాయి. పాములు, తేళ్లు, తేనెటీగలు వంటివైతే ఏ అడవిలోనైనా కామన్. ఎవరికైనా పాము ఎదురుపడితే ఆత్మరక్షణలో భాగంగా దాన్ని చంపేస్తుంటారు. అదేపని అటవీశాఖ సిబ్బంది చేస్తే చాలా పెద్ద నేరం.
మూలం : సాక్షి దినపత్రిక