భారత్‌లో ఉన్నప్పుడు ఓ ఇంగ్లిష్ పత్రికలో చాలా కాలం పనిచేశాను. 2001లో మా స్వస్థలం మంగళూరు నుంచి అమెరికాకు వచ్చాక కూడా విలేకరిగా ఇక్కడ కొన్ని పత్రికల్లో పని చేశా. అలా అట్లాంటా ప్రాంతంలో ఉండే భారతీయులతో పరిచయాలు పెరిగాయి. అవే పత్రిక స్థాపనకు పునాది వేశాయి. కానీ ఇక్కడున్న వనరులతో దినపత్రిక పెట్టి నడపడం కష్టమనిపించింది. అందుకే మాస పత్రికతో మొదలుపెట్టా.
అందులో భారతీయులకు చట్ట పరంగా ఎదురయ్యే సమస్యలూ, వీసా చిక్కులూ, చదువుకుంటూ పార్ట్‌టైంగా పనిచేసే వాళ్ల ఇబ్బందులూ, మన పండగలూ, కమ్యూనిటీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలూ, భారతీయులు నడిపే వ్యాపారాలూ, వాళ్ల విజయ గాథలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్నా. ఇందులోని సమాచారం అమెరికాలో ఉండే భారతీయులకు ఎలా ఉపయోగపడేదీ తెలుగు సమాఖ్యల వారికి వివరించా. దీంతో మొదటి ఎడిషన్‌కు ప్రకటనలను ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. కొన్ని అమెరికన్ సంస్థలూ ప్రకటనలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంతో నా శ్రమ చాలా తగ్గింది. కానీ అమెరికాలో వార్తాపత్రికల జోరు బాగా తగ్గిపోతున్న సమయంలో నేను దీన్ని మొదలుపెట్టా. పత్రికలు చదివే సమయమూ ఎవరికీ ఉండట్లేదు. అందుకే బాగా ఆలోచించి పత్రికను ఉచితంగా అందించాలనుకున్నా. 'అది అయ్యే పని కాదు, బాగా నష్టపోతావ్' అని చాలామంది హెచ్చరించారు. అయినా ఆ నిర్ణయానికే కట్టుబడ్డా. ప్రతి నెలా తీసుకొచ్చే పత్రికలో ఇంట్లో వాళ్లందరికీ ఉపయోగపడే సమాచారం ఉంటే కచ్చితంగా దాన్ని చదువుతారన్నది నా నమ్మకం. అదే నిజమైంది. భారతీయ దేవాలయాలూ, రెస్టారెంట్లూ, సూపర్మార్కెట్ల లాంటి ప్రాంతాల్లో స్టాండ్లను ఏర్పాటు చేసి పత్రికను అక్కడ ఉంచేవాళ్లం. ఉచితమే కాబట్టి చాలామంది తీసుకెళ్లే వారు. 'చదివి బాగుంది' అంటూ ఫోన్లు చేసేవాళ్లు.
పత్రికలో ఇచ్చిన సమాచారం, ప్రకటనల వల్ల వివిధ సంస్థలకు వినియోగదారులు పెరిగారు. దాంతో ప్రకటనలు రావడం ఎక్కువైంది. అదే సమయంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు పత్రికను ఉచితంగా పంపడం మొదలుపెట్టాం. అది చదివి, సర్క్యులేషన్ గురించి తెలుసుకుని భారతీయ వినియోగదారులకు చేరువ కావడానికి ఇదొక మార్గం అని వాళ్లూ భావించారు. అయితే ఈ స్థాయి విజయం సాధించడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. నాకు కారు నడపడం అంటే భయం. అయినా ధైర్యం చేసి కారు కొనుక్కుని, పత్రికలను అనేక ప్రాంతాలకు తిరిగి పంపిణీ చేసేదాన్ని.ప్రకటనలు వస్తున్నాయి ఫర్వాలేదు అనుకుంటున్న సమయంలోనే ఆర్థిక మాంద్యం ప్రభావంతో, సంస్థలు ప్రకటనలు ఇవ్వడం తగ్గించాయి. దాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక ఆఫర్లూ, డిస్కౌంట్లూ ప్రవేశ పెట్టాం. ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోవడానికి విరామమిచ్చి, వార్తల సేకరణ, ఎడిటింగ్, పేజీల లేఅవుట్ లాంటి కీలక బాధ్యతలను నేనే చూసుకోవడం మొదలుపెట్టా. ఫ్రీలాన్సర్లను ఎక్కువగా నియమించుకున్నా. దీంతో బడ్జెట్ అదుపులోకి వచ్చింది. ఈ సమయంలో 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో నాకు స్థానం రావడంతో ఇక్కడి భారతీయులకు నా గురించీ, పత్రిక గురించీ తెలిసి సర్క్యులేషన్ ఇంకా పెరిగి ... లక్షన్నరకు చేరింది. ఆన్లైన్లో చదివే వాళ్ల సంఖ్యా ఎక్కువైంది. విదేశాల్లో పత్రికను స్థాపించిన మొట్టమొదటి మహిళగా నన్ను గుర్తిస్తూ, ఆ పుస్తకంలో నాకు స్థానం కల్పించారు. వాళ్ల దగ్గర నుంచి ఉత్తరం అందేవరకూ నేనే ఈ రంగంలో మొదటి మహిళనని నాకూ తెలీదు. ఇప్పుడు అమెరికాలోని వాయువ్య ప్రాంతం మొత్తానికీ మా పత్రిక చేరుతుంది. దేశవ్యాప్తంగా దాన్ని అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నా.
మూలం : ఈనాడు దినపత్రిక