అపరాజిత తండ్రి ఉద్యోగరీత్యా జాంబియాలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచీ ఆఫ్రికా చుట్టుపక్కల అడవుల్లోని పక్షులూ, జంతువులూ, పచ్చని చెట్లను చూస్తూ పెరిగిన అపరాజితకు జీవ శాస్త్రం ఇష్టమైన పాఠ్యాంశంగా మారింది. దాన్లో పీజీ చదివి, పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది. కొన్నేళ్లకి ఆమె కుటుంబం స్వస్థలం కోల్‌కతాకి వచ్చేశాక అక్కడే అపరాజిత వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. జీవావరణం అంశంలో పీజీ పూర్తి చేసింది.
మధ్యప్రదేశ్, గుజరాత్ కీకారణ్యాల్లోని పక్షులూ, మొక్కల మీద ఎన్నో అధ్యయనాలు చేసిన ఆమె... అరుణాచల్‌ప్రదేశ్ అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే మూడు ముక్కుల పక్షి హార్న్‌బిల్ జీవనశైలిని ఆసక్తిగా గమనించింది. అవి దట్టమైన అడవుల్లో అన్ని రకాల పండ్లు తింటాయి. గింజల్ని వివిధ ప్రాంతాల్లో వెదజల్లుతాయి. దాంతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది. ఆ పక్షుల ప్రత్యేకత, అవి చేస్తున్న మేలు ప్రధానాంశంగా పీహెచ్‌డీ చేసిన అపరాజిత 'నేచర్ కన్జర్వేషన్' పేరుతో ఓ సంస్థని స్థాపించింది.
అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు పక్షులనూ, జంతువులనూ వేటాడకుండా... అటవీ సంపదకు నష్టం కలిగించకుండా అవగాహన కల్పించింది. హార్న్‌బిల్‌ల సంఖ్యను పెంచడానికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసి, వాటి బాధ్యతను గిరిజనులకు అప్పగించింది. వలంటీర్ల సాయంతో ఉద్యానవన తోటలు పెంచి, చేతి వృత్తులను ప్రోత్సహించి... గిరిజనులకు ఉపాధి మార్గం చూపించింది. బడులూ, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసింది. పదేళ్లు తిరిగేసరికి అపరాజిత కృషి ఫలించింది. పక్షుల సంరక్షణ కేంద్రాల సంఖ్య అరవైకి చేరింది. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. జీవ వైవిధ్యంపై ఎన్నో పుస్తకాలు రాసిన అపరాజిత, పిల్లల కోసం ప్రత్యేకంగా హార్న్‌బిల్ పక్షుల గురించి పుస్తకం రాసింది. పదేళ్లుగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన లండన్ ప్రభుత్వం 'గ్రీన్ ఆస్కార్' ఇచ్చి సత్కరించింది.