'నిర్మలమైన మనసే దేవుడిని చూస్తుంది' అన్న ప్రభువు మాటల్ని మదర్‌థెరెసా తన జీవితంలో చేసి, చూపించి, కోట్లాదిమందికి ఆదర్శమహిళగా నిలిచారు. 'జీవితం ఒక అవకాశం దాన్ని ఒక గొప్పలక్ష్యం కోసం వినియోగించు, జీవితం అందమైనది దాన్ని ఒప్పుకో, జీవితం ఒక కల దాన్ని నిజం చేసుకో, జీవితం ఒక వృత్తి దాన్ని పూర్తిచేయి, జీవితం ఒక ఆట సంపూర్ణంగా ఆడు, జీవితం ఒక ప్రమాణం దాన్ని నెరవేర్చు, జీవితం దుఃఖమయం అయినా దాన్ని జయించు, జీవితం ఒక పాట దాన్ని మనసారా పాడు, జీవితం ఒక పోరాటం దాన్ని అంగీకరించు, జీవితం ఒక విషాదం దాన్ని అధిగమించు, జీవితం ఒక సాహసం ధైర్యంగా దాన్ని ఎదుర్కో, జీవితం ఒక అదృష్టం దాన్ని వరించుకో, జీవితం అమూల్యమైనది దాన్ని పాడుచేసుకోకు, జీవితమే ఓ జీవనం దానికోసం నిరంతరం పోరాడు' అంటూ నిర్భాగ్యుల జీవితంలో వెలుగును నింపేందుకు దేశంకాని దేశానికి వచ్చి, చనిపోయేంతవరకూ తన మాటల్ని నెరవేర్చుకుని, నేటికీ అనేకుల మనసును దోచుకుంటున్న ప్రేమమూర్తి, అమృతవాణి మదర్‌థెరెసా. జాతిపిత మహాత్మాగాంధీకి సమానంగా మదర్ ఫొటోను మంత్రుల నుంచి, ఉన్నతాధికారుల వరకు తమ కార్యాలయాల్లో పెట్టుకుని, ఆమెను తమకు ఆదర్శంగా సేవామూర్తిగా తలంచుకుంటూనే ఉంటారు.
బాల్యంలోనే వికసించిన సేవ
మదర్‌థెరెసా 1910 ఆగస్టు 26వతేదీన అల్బేనియాలోని స్కోప్‌జీ (ప్రస్తుతం ఇది మెకడోనియా రాజధానిలో ఉంది)లో జన్మించారు. మదర్ ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయారు. దీంతో ఈమె తల్లి రోమన్‌క్యాథలిక్ విధానంలో మదర్‌ను పెంచారు. కొంతమంది మిషనరీలు బెంగాల్‌లో పనిచేస్తున్న విషయాన్ని థెరెసా తన చర్చిలోని పాస్టర్ల కథల ద్వారా విని, ఆమె నన్‌గా మారి, తన 18వ సంవత్సరంలో మిషనరీగా భారతదేశానికి వచ్చారు. ఇలా వచ్చిన థెరెసా మళ్లీ తన తల్లిని చూడలేకపోయారు. ఆరంభంలో థెరెసా కోల్‌కతాలోని ఒక కాన్వెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. ఇదే సమయంలో ఆమె తన చుట్టూ పేదరికంలో మగ్గుతున్న ప్రజల్ని గమనించేవారు. 1943వ సంవత్సరంలో కోల్‌కతాలో కరువు తాండవమాడినపుడు ఆ పరిస్థితులను చూసిన థెరెసా చలించిపోయారు. అంతే ఆమెలో సేవాభావం ఒక కెరటంలా మనసులో ఎగసిపడింది. ఇదే సమయంలో ఆమె ఒకసారి కొల్‌కతా నుంచి డార్జిలింగ్‌కు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువు ఆమెతో మాట్లాడసాగాడు. ఆయన స్వరాన్ని విన్న థెరెసా దానికి విధేయులై, సేవ కోసం భారత్‌లోనే స్థిరపడ్డారు. 1946వ సంవత్సరంలో సిస్టర్ థెరెసా కాస్త మదర్‌థెరెసాగా మారిపోయారు.
సేవాకార్యక్రమాలు
ఆమె 1948వ సంవత్సరం నుంచి మిషనరీ పనిలో నిమగ్నమయ్యారు. మొదట కేవలం కొద్దికాలం నివాసం ఉండేందుకు భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. పేదల్లో నిరుపేదల్ని ఆమె ఎంపిక చేసుకుని, వారి పోషణభారాన్ని స్వీకరించారు. ఇలా వీరికి సేవ చేయడం ఆరంభించారు. అతికొద్దికాలంలోనే ఈమె సేవాకార్యక్రమాలు మనదేశంలో ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించాయి. దీంతో మనదేశం ఆమెను భారతీయమహిళగా భావించి, శాశ్వత పౌరసత్వాన్ని ఇచ్చింది. పేదల్ని పోషించేందుకు థెరెసా ఆరంభదినాల్లో ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని దాతలను నుంచి అడుక్కోవాల్సి వచ్చేదని ఆమె తన డైరీలో రాసుకున్నారు. దీంతో థెరెసా 'ఇది దేవుడు నాకు ఇచ్చిన సేవ కాదు, ఒకవేళ దేవుడే ఈ పరిచర్యను నాకు ఇస్తే, ఇతరులను అడుక్కునే పరిస్థితికి వచ్చేదాన్ని కాదు' అనుకుని ఆ సేవకు గుడ్‌బై చెప్పాలనుకున్నారు. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను వెనక్కి వెళ్లాలనుకున్నాను. ఆ వైఫల్యమే దేవుడు నాకు విజయంగా మార్చాడు. ప్రభువుపై ఆధారపడే అనుభవాన్ని నాకు ఇచ్చాడు అంటారామె. 1950వ సంవత్సరం అక్టోబర్ 7న కేవలం 13మందితో ఆరంభమైన మదర్ సేవ, నేటికి నాలుగువేలమందికి పైగా సిస్టర్లు అనాథుల సేవలో తరిస్తున్నారంటే ఈ సంఖ్య ఎంతో ఊహించవచ్చు.
కష్టాల కడలిలో...
'నిర్మలమైన మనసు స్వేచ్ఛా మనసే, శాంతి ఒక చిరునవ్వుకు చిహ్నం' అంటూ తన డైరీలో రాసుకున్న థెరెసా ఆ శాంతి కోపం చనిపోయేంత వరకూ పోరాడారు. అనాథలకు ఆమె ఒక దేవత, తాగుబోతులకు ఆమె చేయి ఓ వెచ్చటి ఆప్యాయత స్పర్శ. కోల్‌కతాలో మదర్ సేవను అపార్థం చేసుకున్న ఒక తెగ ప్రజలు ఈమె మన సంస్కృతిని పాడుచేస్తున్నదని ఒక గూండాను మదర్‌పై దాడిచేసేందుకు పంపించారు. ఆమెపై దాడిచేసేందుకు మదర్ ఉన్న ఆశ్రమం తలుపువద్దకు వచ్చిన ఆ గూండా ఆ సమయంలో మదర్ తప్పతాగిన ఒక వ్యక్తి వాంతి చేసుకుంటుండగా, ఆమె తన చేతులతో ఆ వాంతిని పట్టుకుని, శుభ్రం చేస్తున్న దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. ఆమెలో ఒక అద్వితీయశక్తిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె కాళ్లపై పడి క్షమించమని అడిగాడు.
పేదలంటే ఎందుకింత ప్రేమ!
మదర్ థెరెసాకు పేదలంటే ఎందుకింత అభిమానమని గమనిస్తే ఆమెలో రగిలే భావాలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఆమె మనసు ఎప్పుడూ పేదలపైనే తిరుగుతుండేవి. 'ఈ విశ్వంలో ప్రేమకోసం తపించే వారెంతో మంది ఉన్నారు. బాధ, ఒంటరితనం, పేదరికం, ఆదరణ లేకపోవడం, తిరస్కారం, వెలివేయబడడం వంటి వీటిని మనం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటాం. మనలాగా బాధపడేవారిపై మనకున్న భారం ఏంటి?' అని ప్రశ్నించుకుని, ఆ దిశగా వారికి సేవ చేసేందుకు ఆమె ముందుకు వచ్చారు.
భక్తిలో ఉదయించి సేవ
మదర్ సేవకు రాకముందు ఆమెకు ప్రభువుపై విపరీతమైన భక్తి ఉండేది. ఆ భక్తే ఆమెను సేవ వైపుకు నడిపించింది. అందుకు ఆమె తన డైరీలో రాసుకున్న అంశాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. 'నువ్వెప్పుడు మౌనంగా ఉంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడెప్పుడు నీతో మాట్లాడుతాడో వెంటనే ఆయన చెప్పిన పని నీవు చేస్తావు'అనే మాటను థెరెసా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. 'నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి' అని చెప్పిన యేసు మాటకు ఆమె ఎప్పుడూ అవిధేయురాలిగా ప్రవర్తించలేదు. 'నిన్ను నీవే ప్రశ్నించుకో, ఆయనెంతగా నిన్ను ప్రేమించాడో, ఎప్పుడైతే నీవు ఈ విధంగా ప్రశ్నించుకుంటావో, వెంటనే నేనెంతగా ఇతరులను ప్రేమిస్తున్నాను' అనే సందేహం నీలో ఉదయిస్తుంది అంటారు మదర్‌థెరెసా.
నన్ నుంచి సామాజికవేత్తగా ఎదిగిన థెరెసా
చాలామంది మదర్‌థెరెసా అనగానే ఆమెను ఒక సామాజిక సేవకురాలిగా మాత్రమే చూస్తారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండవవైపు ఆమె పూర్తిగా ప్రభువుకు విధేయురాలైన శిష్యురాలు. మదర్‌థెరెసా యేసుక్రీస్తును ప్రేమించకపోయి ఉంటే ఆమె 'నన్'గా మారి ఉండేవారు కారు. నన్‌గా మారిన ఆమె మొదట మిషనరీ తరపున భారతదేశానికి వచ్చారు. సామాజిక సేవ కోసం ఈ దేశానికి రాలేదు కానీ, ఆధ్యాత్మిక చింతనతో నిండిన భావంతో వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లో నిరుపేదలు, ఏ ఆదరణ లేక బాధపడుతున్నవారిని ప్రత్యక్షంగా చూసిన థెరెసా చలించిపోయారు. తిరిగి ఆమె తన స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ భారత్‌లో ఆమె చూసిన దృశ్యాలు వెంటాడే జ్ఞాపకాలుగా ఆమెను నిలువనివ్వలేదు. ఇదే సమయంలో ప్రభువు ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాడు. అందరు ఆడపిల్లల్లా ఉద్యోగం, వివాహం, పిల్లలు వంటి ఆలోచనలతో థెరెసా ఉందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ థెరెసా వీటిని సున్నితంగా తిరస్కరించి, మళ్లీ మిషనరీ తరపున కొల్‌కతాకు వచ్చారు.
నిర్మల్ శిశుభవన్
1955లో మదర్ అనాథ పిల్లల కోసం 'నిర్మల్ శిశుభవన్'ను ఆరంభించారు. 1960లో కుష్ఠురోగులకు సంబంధించిన ఆసుపత్రులను ప్రారంభించారు. ఇదే సమయంలో వెనిజులాలో 1965వ సంవత్సరంలో ఐదుగురు సిస్టర్ల సాయంతో ప్రారంభించారు. రోమ్, టాంజానియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆమె అనాథాశ్రమాలను నిర్మించారు.
సేవను ప్రభావితం చేసిన కొన్ని అంశాలు
థెరెసా గొప్పగొప్ప ప్రసంగాలతో, ఆవేశంతో, అందరిని ఆకట్టుకునేలా ఎప్పుడూ ప్రవర్తించేవారు కారు. చిన్నచిన్న మాటలతో, పదాలతో కోట్లాదిమందిని ఆకట్టుకోగల్గారు. ఏ పనిలోనైనా విజయాన్ని సాధించాలంటే అందుకు 'నమ్మకం, లేదా విశ్వాసం' ఉండాలనేది థెరెసా నమ్మిన సిద్ధాంతం. సేవ చేయాలంటే ఏదో త్యాగం చేసినట్లుగా కాదని, అదెంతో విలువైనదిగా ఉండాలంటే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలని థెరెసా చెబుతుంటారు. 'ఫలించే ప్రార్థన మౌనంగా ఉంటుంది, ఫలించే ఆ ప్రార్థన నమ్మకంతో ఉంటుంది, ఆ నమ్మకం ప్రేమతో నిండి ఉంటుంది, ఆ ప్రేమ సేవ చేసేందుకు ప్రేరేపిస్తుంది, ఆ సేవ ప్రశాంతతను ఇస్తుంది' థెరెసా చెప్పిన ఈ మాట విశ్వఖ్యాతి చెందింది.
వ్యక్తి మరణానికి మనమే కారణం
ఒక వ్యక్తి ఆకలితో చనిపోతే అందుకు బాధ్యులం మనమే అంటారు థెరెసా. మనం ఇతరులతో పంచుకోవాలి. ఆకలి గల వారికి ఆహారాన్ని ఇవ్వమని ప్రభువే చెప్పాడు. 'నాపేరిట ఒక గ్లాసు మంచి నీరు ఇచ్చినా అది నాకు ఇచ్చినట్టే' అని యేసు చెప్పాడు కాబట్టి మనం ఏది ఇచ్చినా, ఏదీ చేసినా ఆయన పేరుతో చేద్దామనేది థెరెసా నమ్మిన సిద్ధాంతం. ప్రతివారిలో ఒకటే తపన కనిపిస్తున్నది, నేను ఎదగాలి, ఐశ్వర్యవంతుడిగా కావాలి, నేను నా కుటుంబం ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని శ్రమిస్తున్నారు. మానవుడు పశువుగా జీవిస్తున్నా దేవదూతలా మరణించాలని చూస్తాడు. కానీ మీకు లేని సమయంలో కొంత సమయాన్ని పేదలకోసం, మీకు ఉండే తక్కువ డబ్బులో కొంత భాగం ఆకలితో అలమటించేవారికి ఇస్తే మీరెంతో సంతోషంగా ఉండగలరని థెరెసా బోధిస్తుంటారు. నేడు ఆమె మనమధ్య లేకపోయినా ఆమె వదిలి వెళ్లిన సేవ కొనసాగుతూనే ఉంది. అదెంత నాణ్యతగా సాగుతుందో మనకు తెలియదు కానీ, ఆమె మనకు చూపిన బాటలో పయనించేందుకు కష్టమైనది మాత్రం కాదు. మనకు ఉన్న కొద్ది ఆదాయంలో కొంత, సమయం చాలని బ్రతుకు పోరాటంలో కాస్త సమయాన్ని పేదల కోసం, ఆకలితో అలమటించేవారికోసం చేద్దాం, సంతోషం, ప్రశాంతత, తృప్తితో నిండిన మనసుతో సాగిపోదాం.