మాది హర్యానా. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం. హర్యానాలోని మా వూరు చేరడానికి ఇరవై నాలుగ్గంటలు ప్రయాణం చేయాలి. ఇల్లు చేరతానన్న సంతోషం ఓ పక్క. మనసులో తెలియని ఆందోళన మరో పక్క.. సాయంత్రం ఆరున్నర అవుతుండగా... మా వూరికి ముందు స్టేషన్‌లో రైలు ఆగింది. మరో పది నిమిషాల్లో దిగాల్సిన దాన్నే కదా అని డోర్ వద్దకి సామానుతో చేరుకున్నా. చలికాలం కావడంతో అప్పటికే ప్రయాణికులు కిటికీలు వేసేసుకున్నారు. అక్కడ దిగాల్సిన వాళ్లు దిగారు. ఇంకొందరు ఎక్కారు. రైలు కదిలింది...
అంతలో ఇద్దరు యువకులు నా దగ్గరికొచ్చి నిలబడ్డారు... ట్రెయిన్ వేగం పుంజుకుంది. అంతలో ఒకడు నా చేతిలో బ్యాగు లాక్కోబోయాడు. అడ్డుకున్నా. ఇద్దరూ కలిసి నన్ను తోసేసి, బ్యాగుతో పారిపోయారు. ఏం జరిగిందో తెలిసేలోపే పట్టాల మీద పడిపోయా. ఒళ్లంతా గాయాలు. వెన్నుపూసకు బలమైన దెబ్బ. ఎడమ కాలిని ఎవరో మెలి తిప్పుతున్నట్టు విపరీతమైన నొప్పి. పంటి బిగువున బాధను భరిస్తూ రక్షించండి అని అరుస్తూనే ఉన్నా. అరగంట తరవాతనుకుంటా... దగ్గర్లో పని చేస్తున్న కూలీలు చూసి పరుగెత్తుకొచ్చారు. 'సాయం పట్టండి... ఆస్పత్రికి తీసుకెళదాం', 'బ్యాగు వెతికి, ఇంటి అడ్రెస్ చూడండి...' అంటూ వాళ్లు అనుకుంటుండగానే నేను స్పృహ కోల్పోయాను.
మాది హర్యానాలోని ఫరీదాబాద్. నాన్న దోబీ. తన సంపాదనతోనే మా ఇల్లు గడిచేది. ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని. పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. ఇంటర్‌కి వచ్చే సరికి మా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రెండేళ్లు గడిచేసరికి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరుగుపొరుగు 'చదివింది చాలు. మీ నాన్నని ఇబ్బంది పెట్టకుండా పెళ్లి చేసుకో' అనేవారు. లెక్చరర్లు మాత్రం 'మీ అమ్మాయి బాగా చదువుతుంది. చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది' అంటూ నాన్నకి చెప్పారు. 'నా కూతురికి ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు. కానీ తన కాళ్ల మీద తాను నిలబడేంత వరకూ చదివిస్తా' అంటూ నాన్న అప్పులు చేసి, నన్ను డిగ్రీ చదివించారు. పీజీ ఎంట్రన్సులో మంచి ర్యాంకొచ్చింది. మొదటి సంవత్సరం విశ్వవిద్యాలయ టాపర్‌గా నిలిచా. దాంతో ఫీజు లేకుండా చదువుకునే అవకాశం లభించింది. పూర్తిగా చదువుపైనే శ్రద్ధపెట్టా. చదువు పూర్తయ్యే సమయానికి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. శిక్షణ పూర్తి చేసుకుని, హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో చేరా.
డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ ప్రతి నెలా కొంత ఇంటికి పంపేదాన్ని. తమ్ముడూ, చెల్లిని కూడా మంచి కాలేజీలో చేర్పించాను. అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కష్టాలు తీరుతున్నాయనుకుంటున్న సమయంలో రైలు ప్రమాదం కుంగదీసింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలు. చాలాచోట్ల కుట్లు పడ్డాయి. రెండు శస్త్ర చికిత్సలు చేశారు. తప్పని పరిస్థితుల్లో ఎడమ కాలు మోకాలి వరకూ తీసేశారు. అస్సలు కదల్లేని పరిస్థితి. వెన్నుపూసకు ఏ ప్రమాదం లేదు కానీ కొన్ని నెలలు మంచానికి పరిమితమయ్యాను. నా పరిస్థితి చూసి అమ్మానాన్నలు తల్లడిల్లిపోయారు. బాధను దిగమింగుకుని నన్ను ఓదార్చారు. మూడు నెలలు దాటాయి. శారీరకంగా కొంత కోలుకున్నా. కానీ మానసికంగా కుంగిపోయా. ఇంట్లో పరిస్థితులూ క్షీణించాయి. నాన్న ఇంకా అప్పులు చేయాల్సి వచ్చింది.
'ఇంక ఈ పిల్లకి పెళ్లెలా అవుతుందో.... ఒంటి కాలితో ఎలా బతుకుతుందో ఏంటో...' అంటూ ఇరుగుపొరుగు వాళ్లు అనే మాటలు నన్నింకా నిరాశలోకి నెట్టేశాయి. జీవితమే పాడయ్యాక జీతం, ఉద్యోగం ఏంటి అన్న వైరాగ్యం చుట్టుముట్టింది. ఆర్నెల్లపాటు ఇంట్లోనే ఉండిపోయా. ఒకరోజు డీపీ సింగ్ అనే వ్యక్తి గురించి ఓ ఛానల్‌లో కథనం ప్రసారమైంది. మేజర్‌గా పని చేసిన సింగ్ కార్గిల్ యుద్ధంలో కాలు పోగొట్టుకున్నారు. అయినా సరే, కృత్రిమంగా కాలు అమర్చుకొని భారత దేశపు మొట్టమొదటి బ్లేడ్ రన్నర్‌గా పేరు తెచ్చుకున్నారు. అతని కథనం చూసి నాలో ఏదో సంచలనం, ఉత్సాహం, ధైర్యం! చిన్నవో, పెద్దవో కష్టాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి... వాటిని దాటడంలోనే గొప్పతనం ఉంది అనుకున్నా.
ప్రతి నెలా ఆదాయం వస్తే పరిస్థితుల్లో మార్పొస్తుంది అనుకున్నా. వెంటనే ఉద్యోగంలో చేరా. నెట్‌లో వెతికితే డీపీ సింగ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని తెలిసి వెళ్లి కలిశా. 'మనం హ్యాండీక్యాప్డ్ అని బాధపడితే ఏం ప్రయోజనం లేదు. హ్యాండీ క్యాపబుల్ అని నిరూపించుకోవాలి. ఉద్యోగం, జీతం దగ్గర ఆగిపోకు. కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకో...' అంటూ ఎన్నో మాటలు చెప్పారు. ఆ ప్రభావంతో నా మీద నాకుండే జాలీ, బతుకంటే ఉన్న భయం పోయాయి. డబ్బు కూడబెట్టుకుని కృత్రిమ కాలు పెట్టించుకున్నా. నడవడం, నా పనులు నేను చేసుకోవడం అలవాటు చేసుకున్నా. నాలాంటి వాళ్ల కోసం ఓ క్లబ్ ఉందని తెలుసుకుని, దానిలో సభ్యురాలినయ్యా. అందులో చాలామంది సైక్లింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయా. నేనూ వాళ్లలా సైకిల్ తొక్కాలనుకున్నా. అప్పటివరకూ సైకిల్ తొక్కింది లేదు. అయినా పట్టుదలగా ప్రాక్టీసు మొదలుపెట్టా.
ఎడమకాలితో పెడల్ తొక్కలేక, కాలు మడతపెట్టలేక, వేగం అందుకోలేక... కళ్లల్లో నీళ్లు తిరిగేవి. అయినా ప్రతిరోజూ సాయంత్రం ఆఫీసు అయిపోగానే, లింగంపల్లి నుంచి నెక్లెస్ రోడ్డు వరకూ ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో వచ్చి, రాత్రి తొమ్మిది వరకూ సాధన చేసేదాన్ని. ఈ క్రమంలో దెబ్బలు తగిలాయి. కానీ నాలుగు నెలలు గడిచేసరికి సైకిల్ తొక్కగల నైపుణ్యం వచ్చేసింది. అప్పుడే, ఈ ఏడాది మార్చిలో సైక్లింగ్ పోటీల ప్రకటన నన్ను ఆకట్టుకుంది. దాన్లో పాల్గొనాలనుకున్నా. అమ్మానాన్నలకు విషయం తెలిసి వద్దని వారించారు. ఓడిపోయినా సరే, పోటీ పడాల్సిందే అనుకుని దరఖాస్తు చేశా. ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాక గెలవాల్సిందే అనుకున్నా. అదే జరిగింది... ఐదు కిలోమీటర్ల మారథాన్‌లో నేను ఫస్టొచ్చా. ఆ బంగారు పతకం... నేను రైల్లో పోగొట్టుకున్న చెయిన్‌ని గుర్తుకుతెచ్చింది. అంతులేని ఆత్మవిశ్వాసాన్ని అందించింది. భుజానికెత్తుకున్న బాధ్యతల్ని నేనే నెరవేర్చాలన్న ఆత్మస్త్థెర్యాన్ని కూడగట్టుకునేలా చేసింది. ఈ సమయంలోనే నాకో కొత్త లక్ష్యం ఏర్పడింది. మరిన్ని సైక్లింగ్ పోటీల్లో పాల్గొని, వచ్చే ఏడాది జరగనున్న పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్నదే నా ధ్యేయం. అదే ధ్యాసగా ఇప్పుడు కఠిన సాధన చేస్తున్నా. వారాంతాల్లో కొందరు సహోద్యోగులతో కలిసి అనాథాశ్రమాలకు వెళ్లి తోచిన సాయం అందిస్తున్నాం. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి రెండు కాళ్లను కోల్పోయింది. చికిత్స పొందుతున్న తన వద్దకెళ్లి కుంగిపోకుండా ధైర్యం చెప్పా. తను మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకునేలా ప్రోత్సహించా. కుంగిపోకుండా కొత్త లక్ష్యాలు ఏర్పర్చుకుని నవ్వుతూ కనిపిస్తున్న నన్ను చూసి అమ్మానాన్నలూ, తమ్ముడూ, చెల్లి ఆనందంగా ఉన్నారు. 'ఒంటి కాలితో సైక్లింగ్‌లో పతకం సాధించి నువ్వు పదిమందికీ స్ఫూర్తి పంచాలి' అంటూ డీపీసింగ్ వెన్నుతడుతున్నారు.