తమకు చదువు చెప్పిన గురువును విద్యార్థులు గుర్తు పెట్టుకోవడమే గగనమైపోయిన ఈ రోజుల్లో... విద్యార్థి తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకున్నారంటే... ఆ ప్రొఫెసర్ మంచితనం చెప్పకనే అర్థమవుతుంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని ఓ కుగ్రామం కొర్వటికల్. చుట్టూ కాలువలున్నా చుక్కనీరు లేని దారుణమైన పరిస్థితి ఆ గ్రామానిది. అలాంటి మారుమూల ప్రాంతంలో మాదిడ్డి తిరుమల్‌డ్డి, వినోదమ్మ దంపతులకు జన్మించింది అండమ్మ. నలుగురు చెలెళ్లు, ఒక తమ్ముడున్న కుటుంబంలో పెద్దది. ఆ ఊళ్లో మూడో తరగతి వరకే ఉండేది. కానీ అండమ్మకేమో చదువుకోవాలన్న తపన ఎక్కువ. అందుకే నాలుగో తరగతికోసం అమ్మమ్మ వాళ్ల ఊరి(వలిగొండ మండలం వెలువర్తి)కి వెళ్లింది. రెండేళ్లకే మళ్లీ ఆమెను దురదృష్టం వెంటాడింది. అక్కడా ఐదో తరగతి వరకే ఉంది. ఇక ఆరో తరగతి కోసం రానుపోను పది కిలోమీటర్ల దూరం నడిచి వలిగొండలో పూర్తి చేసింది. ఆడపిల్ల అలా నడిచి వెళ్లడం ఇబ్బందవుతుందని మాన్పిద్దామనుకున్నారు. కానీ పట్టువీడలేదామె. ఓల్డ్‌సిటీలోని అలియాబాద్‌లో అక్క (పెద్దమ్మ కూతురు) ఇంట్లో ఉండి శ్రీ ప్రసన్న గజానన హై స్కూల్లో ఏడు, ఎనిమిది చదువుకున్నది. అప్పుడే చైనా యుద్ధం... అది ఆమె పాలిట శాపమైంది. బియ్యం, గోధుమలకు కటకట వచ్చింది. అక్కనెందుకు ఇబ్బంది పెట్టడమని... సూర్యాపేటలో ఉన్న ఇంకో అక్క దగ్గర ఉండి 9 తరగతి చదువుకున్నది. కానీ అక్కడ వాతావరణమూ ఆమెకు సరిపడలేదు. పదో తరగతికి నల్గొండకు వచ్చింది. అక్కడ ఉంచి చదివించడానికి ససేమిరా అన్నారు తల్లిదండ్రులు . అయినా ‘ఎక్కువ చదివితే అంతకన్నా ఎక్కువ చదివిన భర్తను తీసుకురావాలి. అందుకోసం ఉన్న ఆస్తంతా నీకే పెడితే తరువాత నలుగురు చెల్లెళ్లు, తమ్ముడు ఏమైపోవాలి?’ అని దూరదృష్టితో ఆలోచించిన తల్లిదండ్రులు చదువు ఆపేసారు.
తల్లిదండ్రుల కోసమైతే...
బడి మానేసింది కానీ... ఆమె మనసంతా చదువుమీదే ఉంది. అందుకే చేర్యాల దగ్గరి నాగపురిలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఇంకో పెద్దమ్మ కొడుకు కొట్టం లకా్ష్మడ్డికి ఉత్తరం రాసింది ‘అన్నయ్య... నాకు చదువుకోవాలని ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఎలా?’ అని. ఆమెలోని ఆసక్తిని చూసిన ఆయన వెంటనే వచ్చి నాగపురికి తీసుకెళ్లాడు. ఆయన కూతురు లతతో కలిసి చదువుకోవడం మొదలుపెట్టింది. అయితే అప్పుడే(1969లో) ఎస్‌ఎస్‌సీని ప్రారంభించారు. తొలిసారి కాబట్టి ప్రయివేటుకు అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలోనే చండూరు మండలం గుండ్రేపల్లికి చెందిన పిట్టా సుధాకర్‌డ్డితో పెళ్లయ్యింది అండమ్మకు. అయితే అప్పట్లో పెళ్లయిన రెండేళ్లకు గానీ అత్తారింటికి పంపకపోయేవాళ్లు. ఆ అంశం కలిసొచ్చిందామెకు. తల్లిగారింట్లో ఉండే భర్తకు ఉత్తరం రాసింది ‘నాకు చదువుకోవాలని ఉంది. పదో తరగతి చదవడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో చూడండి’ అని. డిప్లొమా చదువుతున్న సుధాకర్‌డ్డి భార్య ఆసక్తిని కాదనలేదు. ఉస్మానియాలో మెట్రిక్యులేషన్ గురించి తెలుసుకున్నాడు. వెంటనే తనకు ఊరినుంచి తల్లిదండ్రులు నెలకు పంపించే 35 రూపాయలు పెట్టి భార్యకు పుస్తకాలు కొని ఇచ్చాడు. ఓవైపు ‘టైపు నేర్చుకో.. బాగా చదువుకో’ అని కొడుకులు ఖర్చులకోసం ఇచ్చిన డబ్బులు తనకు ఇచ్చే అమ్మమ్మ, మరోవైపు భర్త.. ఇలా ఇద్దరి ప్రోత్సాహంతో ముందుకు సాగింది అండమ్మ. మెట్రిక్యులేషన్ పాసయ్యింది.
పాసవడంతోనే...
అత్తారింటికి వెళ్లింది. తరువాత బాబు పుట్టాడు. కానీ చదువుకోవాలన్న పట్టుదల మాత్రం ఆమెలో తగ్గలేదు. ఇంటర్ ప్రయివేటుగా కట్టింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ డిక్షనరీలు కొనుక్కుని పుస్తకాలు చదువుకునేది. అర్థంకాకపోతే అండర్‌లైన్ చేసుకొని, తరువాత వాటి అర్థాలు పక్కనే రాసుకుని అర్థం చేసుకునేది. ఊళ్లో అందరూ వ్యవసాయదారులే. ఇప్పటిలా ఊళ్లల్లో టీవీలు లేవు. ఏడున్నర, ఎనిమిదికల్లా అందరూ పడుకునేవారు. అప్పుడు అండమ్మ మేల్కొనేది. రాత్రి 11, 12 గంటలవరకు చదువుతుండేది. 4 గంటలకు లేచి మళ్లీ చదవడం. అలా పట్టుదలతో చదివి ఇంటర్మీడియెట్ కూడా పూర్తిచేసింది. డిగ్రీ చదవాలన్న ఆలోచన, ఆమె హైదరాబాద్ ప్రయాణం ఒకేసారి జరిగాయి. కట్నంగా వచ్చిన రెండెకరాల్లోని పంట మీద వచ్చిన డబ్బే ఆధారం. అందుకే స్కూల్‌లో పనిచేసేది. ఆ కాలంలో ఇప్పటిలాగ లేదు బీఏ. విడతల వారీగా చదువుకునే అవకాశం. అందుకే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లాంగ్వేజెస్ ఒకేసారి కట్టింది. ఓవైపు పిల్లలు, మరోవైపు ఉద్యోగం. సమయమే చిక్కకపోయేది. గుర్తొచ్చింది గుర్తొచ్చినట్టు చేతి మీద, గోడల మీద రాసుకునేది. బస్సులో కూర్చుని నెమరువేసుకునేది. ఇలా నిత్యం పుస్తకాలు తప్ప మరో ప్రపంచం లేకుండా బతికింది. లాంగ్వేజెస్ పూర్తికాగానే ఆప్షనల్స్ 9 సబ్జెక్టులు ఒకేసారి కట్టింది. ఆమె కష్టానికి ఫలితం అందింది. డిగ్రీ పూర్తయ్యింది. ఎమ్మే ఎంట్రన్స్ రాసింది. మొదటిసారికే వచ్చింది. ఎమ్మే బ్యాచ్‌లో 22మంది ఆడపిల్లలు. 8 మంది మాత్రమే అబ్బాయిలు. ఆ 30 మందిలో అండమ్మ ఒక్కదానికే ఎంఫిల్ వచ్చింది. ‘నల్గొండ జిల్లా గ్రామదేవతలు’ అనే అంశంపై పరిశోధన చేసింది. జానపద విజ్ఞానంలో ఫీల్డ్ వర్కర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పట్లో నాలుగు వందల రూపాయలు... 40 వేల విలువ. తరువాత పీహెచ్‌డీ.. ఇలా చదువుకుంటూనే పోయింది. 1988లో కొడుకు ఇంజనీరింగ్ పట్టా పొందుతుంటే.. మరోవైపు తను డాక్టరేట్ చేతికందుకుంది. చదువుమీద ఆమెకున్న ఆసక్తికిదో తార్కాణం. తన చదువు డిప్లొమాతోనే ఆగిపోయినా, భార్య డాక్టరేట్ పొందేదాక వెన్నుదన్నుగా ఉన్న సుధాకర్‌డ్డి వ్యక్తిత్వం... సహచరునికి నిజమైన నిర్వచనం!
1990లో...
వార్డెన్‌గా ఉద్యోగమొచ్చింది అండమ్మకు. కానీ వెన్నెముక సమస్యతో భర్తకు పక్షవాతం వచ్చింది. దగ్గరుండి సపర్యలు చేసింది. ఒక నెలరోజుల్లోనే రికవర్ అయ్యాడు. ఇక అక్కడినుంచి ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఉద్యోగం రెగ్యులరైజ్ కాకముందు... ఒకవారంలో మూడు యూనివర్సిటీల్లో పనిచేసింది. ఆదివారం ఓపెన్ యూనివర్సిటీలో క్లాసులు చెప్పేది, రాత్రి ఆరునుంచి 8 దాకా తెలుగు యూనివర్సిటీలో పార్ట్‌టైం జాబ్. ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ క్లాసెస్ తీసుకునేది. జేఆర్‌ఎఫ్ హోల్డర్ కదా! అవకాశం ఉండేది. అయితే ప్రొఫెసర్‌గా ఆమె క్లాస్‌రూమ్‌కే పరిమితం కాలేదు. పనిచేసిన చోటల్లా విద్యార్థులతో సత్సంబంధాలు నెరిపింది. వాళ్ల సాధకబాధకాలు తెలుసుకుంది. అవసరమైనప్పుడు సాయం కూడా చేసింది. అందుకు నిదర్శనం ఆర్ట్స్ కాలేజ్‌లో జరిగిన పదవీవిరమణ సభే! తెలంగాణ, పాలమూరు, శాతవాహన, తెలుగు, ఉస్మానియా ఇలా అన్ని యూనివర్సిటీల నుంచి నాలుగైదు వందల మంది వచ్చారు. అదంతా ఎలా సాధ్యమైందంటే ఆమె మానవ సంబంధాలే!
వృత్తిలో...
విధి నిర్వహణలో తనకు సూర్యుడు, విలువల్లో బుద్ధుడు ఆదర్శం అంటుంది అండమ్మ. అందుకే ఏ పనిచేసినా నిబద్ధతతో చేసింది. రుక్ముద్దీన్ కంట్రోలర్! స్పాట్ వాల్యుయేషన్‌కు కో ఆర్డినేటర్‌గా ఉంది అండమ్మ. ఆ బాధ్యతలు అప్పగించగానే ‘కళ్లు తెరిచి పనిచేయాలా? కళ్లు మూయాలా? అని అడిగింది! ఆ మాటల్లో అర్థం తెలుసుకున్న ఆయన కళ్లు తెరవమన్నారు. అక్కడ అవకతవకలను సరిదిద్దింది. ఆమె ఏంటో అధ్యాపకులకు తెలిసిపోయింది. అందుకే ఔటా (ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్) బాధ్యతలను రెండు దఫాలు అంటే నాలుగేళ్లపాటు ఆమెకు అప్పగించారు. తరువాత జీతభత్యాలకోసం ఆమె నేతృత్వంలో నడిచిన పోరాటం ఫలించింది. అన్నింట్లో మహిళలకు 1/3 వంతు అవకాశం కల్పించాలని ఎన్టీరామారావు చట్టం తెచ్చారు. కానీ అది యూనివర్సిటీలో అమలు జరగ ఆ అమలుకోసం కొట్లాడిందామె. ‘అబ్బాయిలకేమో ఏ,బీ,సీ,డీ,ఈ ఇలా అనేక హాస్టళ్లు ఉంటాయి. మరి అమ్మాయిలకెందుకు ఒక్కటే హాస్టల్?’అని ప్రశ్నించింది. అప్పటి వైఎస్ ఛాన్సలర్ మల్లాడ్డి స్పందించారు. అదనపు భవనాలను మంజూరు చేశారు. అది ఆమె ఘనతే. రామకృష్ణయ్య వీసీగా ఉన్న సమయం... లాంగ్వేజెస్‌లో విద్యార్థులు పది మంది లేకపోతే... ఆ సబ్జెక్టును తీసేయ్యాలనే కొత్త రూల్ వచ్చింది. మళ్లీ ఆమె పోరాటం ప్రారంభయ్యింది. ‘ఇంజనీరింగ్ కోర్సులు పైకి అగుపడేవి. లాంగ్వేజెస్ కనిపించకుండా ఉండే రక్తంలాంటివి. మీరు రక్తాన్ని తీసేస్తా అంటున్నారు. అదెట్లా సార్?’ అని అడిగింది. వెంటనే యూనివర్సిటీ రూల్ రద్దు చేసి ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నా సరే.. కంటిన్యూ చేయాలనే రూల్ తెచ్చారు. ఆమె ఖాతాలో చేరిన మరో విజయం ఇది! 12 మంది ఎంఫిల్ విద్యార్థులకు, 15 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించింది. ఒగ్గుకథ, జముకు కథ, కిరాతార్జునీయం, మత పురాణం, అగుమంచి కథలపై అనేక లెక్చర్స్ ఇచ్చింది. 28 ఏళ్ల బోధనానుభవంలో 20 ఏళ్లు పీజీ విద్యార్థులకు, 15 ఏళ్లు యూజీ విద్యార్థులకు పాఠాలు చెప్పింది. ఎన్నో జీవిత పాఠాలను బోధించింది. ఓ రీసెర్చ్ స్కాలర్‌గా తెలంగాణలోని కొన్ని వందల గ్రామాలు తిరిగి అధ్యయనం చేసింది. సంస్కృతి, సంప్రదాయలు, పండుగలు, ఉత్సవాలను భద్రపరిచింది. తెలంగాణ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించింది!
సమాజంలోకి రండి..
మా ఆయన చదువు డిప్లొమాతోనే ఆగిపోయింది. నేను చదువుతూ వచ్చాను. అంతమావూతాన నేను తనని తక్కువగా చూసింది లేదు. ఆయన ఫీలయ్యిందీ లేదు. కాకపోతే... నేను ఫీల్డ్‌వర్క్‌కోసం వెళ్లినప్పుడు ‘ఇంకా చదువుకుంటూ పోతే మొగుడికి వింటావా? మీ ఇంట్లో ఇంత చదివినోళ్లు ఎవరైనా ఉన్నారా?’ అని మాట్లాడేవాళ్లు. ఇక తాత వరుసైన వాళ్లైతే ‘ఇంత తిరుగుతున్నవే? ఎంత మంది మనుమలే నాకు?’ వ్యంగ్యంగా అనేవాళ్లు. ‘నిజమే తాతా.. పచ్చకామెర్లొచ్చినోళ్లకు అంతా పచ్చగనే కనపడతరు’ అని ఊరుకునేదాన్ని. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం రాగనే పరిస్థితి మారిపోయింది. ‘అండాలు నువు కష్టపడి సాధించినవే!’ అన్నరు. అందుకే ఎవరో ఏదో అంటరని, ఉద్యమాలు చేసి టీవీల్లో కనపడితే తల్లిదండ్రులు కోప్పడతారని, పెళ్లిళ్లు కావని ఆడపిల్లలు అస్సలు భయపడొద్దు. తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చినట్టే... ఏ సమస్యొచ్చినా బయటికి రండి! ఒకప్పుడు చదువులేదు. ఇంట్లనే ఉన్నం. మన కోసం రాజా రామ్‌మోహన్‌రాయో, కందుకూరి వీరేశలింగమో వచ్చి మనకోసం ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడలా కాదు. చదువు, శక్తి ఉంది. అధికారం ఉంది. ఇల్లు ఇల్లు అని పట్టుకుని ఏడవడం కన్నా బయటి సమాజంలోకి రావాలి. మనకు కావాల్సిందాన్ని మనమే సాధించుకోవాలి. హక్కులకోసం అడగడానికి ముందు మన బాధ్యతలను కూడా నెరవేర్చాలి! నాకు డాక్టర్ కావాలని ఉండే. కానీ చదివిందంతా డిస్టెన్స్‌లో. సైన్స్ సబ్జెక్టులు కష్టం. అందుకే ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకున్నా. నా తీరని కోరికను నా కూతురు, కోడలు తీర్చారు. కానీ వాళ్లు విదేశాల్లో సేవ చేస్తున్నారు. అదొక్కటే బాధ! కానీ సమాజానికి, భావజాలానికి సంబంధించిన చరిత్ర ఎక్కువ ఇష్టం. ఆ భావజాలాన్ని ఎక్కువ మందికి పంచగలిగేది టీచర్‌గానే.
రాసిన పుస్తకాలు
నల్గొండ జిల్లా - గ్రామ దేవతలు
జానపద సాహిత్యంలో శక్తి
ఆణిముత్యాలు - నల్గొండ జిల్లా జానపద సాహిత్యం
అరుణ కిరణాలు పరిశోధనాత్మక వ్యాసాలు
గ్రామదేవతల పూజా ద్రవ్యాలు-సాంస్కృతికాంశాలు
ఖమ్మం - కొత్తగూడెం జానపద గేయాలు