ఎఐసిసి సెక్రటరీగా నియామకం
సమస్యలపై నిరంతర పోరాటం
ట్రస్టుతో ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు
చేయడం అంటే ఎంతో అభిమానం
ప్రియాదత్ యువ రాజకీయ నేతల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు. సునీల్ దత్ కూతురిగా, సంజయ్‌దత్ సోదరిగా రాజకీయాల్లోకి వచ్చినా తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మెుదటిసారి 14వ లోక్‌సభకు ముంబయ్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం 15వ లోక్‌సభలోనూ కొనసాగుతున్నారు.
బాలీవుడ్‌లో పేరుపొందిన నటుడు సునీల్ దత్ కూతరు ప్రియాదత్. తల్లి నర్గీస్ కూడా పేరుపొందిన నటి. వీరిద్దరూ గతంలో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. సునీత్ దత్ మంత్రిగా కూడా పనిచేశారు. సంజయ్ నటనను వారసత్వంగా ఎంచుకోగా ప్రియా మాత్రం రాజకీయాలను ఎంచుకుంది. తండ్రి నుంచి ఎన్నో రాజకీయ పాఠాలు నేర్చుకుంది. రాజకీయ నాయకురాలు అనే హోదా కోసం కాదని ప్రజా సేవ చేయడమే తన పరమార్థం అని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. యూనివర్సిటీలో డిగ్రీ పూర్తికాగానే టెలివిజన్ అండ్ వీడియో రంగంలో కొంత కాలం పనిచేసింది. తరువాత న్యూయార్క్‌లో మీడియా ఆర్ట్‌సలో విద్యను అభ్యసించింది. 1992-93లో జరిగిన అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయిన ముస్లిం శరనార్థుల కోసం ఆమె సహాయ చర్యలు తీసుకున్నారు. 2005లో రాజకీయ అరంగేట్రం చేసిన ముంబయ్ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. శివసేన పార్టీ లీడర్‌పై 1,72,043 ఓట్ల మెజారీటీ సాధించింది.
ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ విజయం సాధించిన మహిళగా ఈమె పలువురి ప్రశంసలు పొందారు. దీంతో ముంబయ్‌లో మీడియా వర్గాలు దత్ విజయంపైనే ఫోకస్ చేశాయి. అన్యూహ్య విజయం అంటూ పొడగ్తల వర్షం కురిపించాయి. తండ్రిని మించిన తనయ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. కానీ ఆమె ఈ రాతలకు, ప్రశంసలకు ఏ మాత్రం పొంగిపోలేదు. అంత మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తాను ఏం చేయగలనో అన్న దానిపైనే ఆమె దృష్టి పెట్టారు. విచిత్రంగా ఈ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమె ఓ బాబుకు జన్మనివ్వడం జరిగింది. దీంతో కొంత ప్రచారానికి ఇబ్బంది ఏర్పడింది. తరువాత ప్రియా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆమె పరిధిలోని శాసనసభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులతో నిరంతరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. అదో టైంటేబుల్‌లా ఏర్పాటు చేసుకున్నారంటే ఆమె చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఉత్తమ పాలన అందించడం కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉండేది. అంతేకాదు పేదలకు సాయం చేయడం కోసం తల్లి నర్గీస్ పేరు మీద ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2008 బీహార్‌లో వరదలు వచ్చి ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు.
మన రాష్ట్రం కాదు కదా .. మనకెందుకు అని అనుకోకుండా వందలాది మంది వంటపాత్రలు, బియ్యం అందజేయడంలో ఈ ట్రస్టు కీలకపాత్ర పోషించింది. నేరుగా భర్తతో కలిసి ప్రియా సహాయ శిబిరాలను సందర్శించి వస్తుసామగ్రిని పంపిణీ చేశారు. కామతిపుర ప్రాంతంలోని సెక్స్ వర్కర్లను ఆ ఊబిలోంచి బయటకు తీసుకుని వచ్చి వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తన విన్నపాన్ని తెలియజేశారు. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఓవెన్ రాన్‌కాన్‌ను వివాహం చేసుకుంది. ఓరాన్జాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఈయన వాటాదారుడు. ఇది వివిధ దేశాల్లో మ్యూజిక్‌ను అందించే కంపెనీ. రాన్‌కాన్, ప్రియాలకు ఇద్దరు సంతానం సిదార్థ, సుమీర్.